న్యూఢిల్లీ: పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారును మారుతి సుజుకీ త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ ఏడాది జూన్ 5న ఢిల్లీలో దీనిని లాంచ్ చేయనుంది. పర్యావరణ దినోత్సవం కావడంతో ఈ తేదీని ఎంచుకుంది. క్రూడాయిల్ దిగుమతులను తగ్గించి, పర్యావరణహిత ఇథనాల్ ఇంధనాలను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును మారుతి తీసుకొచ్చింది.
వ్యాగన్ ఆర్ మోడల్‌లో ఈ వేరియంట్‌ను తెస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, దేశీయ చక్కెర పరిశ్రమలో అవసరానికి మించి ఉన్న అదనపు చెరుకు నిల్వలను ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడం ద్వారా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించొచ్చు.
ఇప్పటికే వాడుతున్న గడ్కరీ
కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుతం టయోటా కంపెనీ తయారు చేసిన ప్రోటోటైప్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బండి ఇన్నోవాను వాడుతున్నారు. ఇది పూర్తిగా బయో-ఇథనాల్‌తో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి బీఎస్6 ఎలక్ట్రిఫైడ్ కారు. దీనిని టయోటా సంస్థ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది.
ఖర్చు చాలా తక్కువ. ఈ కారు గురించి గడ్కరీ స్వయంగా మాట్లాడుతూ, ప్రస్తుతం ఒక లీటరు ఇథనాల్ ధర దాదాపు రూ.65 వరకు ఉంటుందని చెప్పారు. పైగా ఈ కారు ప్రయాణంలో ఉన్నప్పుడు దాదాపు 60శాతం వరకు తన సొంత విద్యుత్‌ను తానే జనరేట్ చేసుకుంటుందని (హైబ్రిడ్ టెక్నాలజీ) తెలిపారు.
సాధారణ కారు ఇంజిన్ ఇథనాల్ వల్ల త్వరగా పాడవుతుంది (తుప్పు పడుతుంది). అందుకే భారతీయ ఇంజనీర్లు ఈ కారులోని పిస్టన్ రింగులు, స్పార్క్ ప్లగ్‌లు, ఫ్యూయల్ పంప్, పైపులను ఇథనాల్‌కు తట్టుకునేలా ప్రత్యేకంగా మార్చారు. ఈ రకమైన పూర్తి ఇథనాల్ బండ్ల రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్‌లోనే టెస్టింగ్, సర్టిఫికేషన్ నిబంధనలలో 'ఈ100' కేటగిరీని అధికారికంగా చేర్చింది. దీనివల్ల ఈ కార్ల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.
రేస్‌లో ఇతర కంపెనీలు..
టాటా మోటార్స్ (టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్), టయోటా, మహీంద్రా, హ్యుందాయ్ వంటి కంపెనీలు కూడా తమ 100శాతం ఇథనాల్ ఆధారిత ప్రోటోటైప్/కాన్సెప్ట్ వాహనాలను ఇప్పటికే ప్రదర్శించాయి. త్వరలో కమర్షియల్ లాంచ్ చేపట్టాలని చూస్తున్నాయి.
టాటా సంస్థ 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో తమ మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును తెస్తామని ప్రకటించింది. టూ-వీలర్లలో హోండా, సుజుకి వంటి కంపెనీలు ఇప్పటికే ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లను తయారు చేసి ఆటో షోలలో ప్రదర్శించాయి.
