
హైదరాబాద్: ‘మార్వాడీ వ్యాపారి హఠావో-తెలంగాణ వ్యాపారీ బచావో’ పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీనగర్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ... 3 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ.. గతంలో తెలంగాణను ఆంధ్రా పాలకులు దోచేస్తే.. ఇప్పుడు గుజరాత్, రాజస్థానీ మార్వాడీలు దోచేస్తున్నారని అన్నారు.
తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తూ.. గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి ఆరాచకాలను ఇక సహించేది లేదని తెలంగాణ నుంచి ఉరికించి కొడుతామని హెచ్చరించారు. గతంలో ఆంధ్రా పెత్తందారులను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణ వాదులకు ఉందని.. అది మార్వాడీలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
తెలంగాణలో ఇటీవల గో బ్యాక్ మార్వాడీ (Go Back Marwadi) అనే నినాదంతో సోషల్ మీడియాలో ఓ ఉద్యమం మొదలయిన సంగతి తెలిసిందే. ఈ వివాదం సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో జరిగిన ఓ ఘటనతో మొదలైంది. పార్కింగ్ విషయంలో ఓ దళితుడిపై మార్వాడీ వ్యాపారులు దాడి చేశారని అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన గాయకుడు, రచయిత గోరేటి రమేష్ మార్వాడీల దోపిడీని వివరిస్తూ ఒక పాట రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ పాట పెద్ద ఎత్తున వైరల్ కావడంతో మార్వాడీలకు వ్యతిరేకంగా గో బ్యాక్ మార్వాడీ అనే నినాదం మొదలైంది. గోరేటి రమేష్ రాసిన పాటతో స్ఫూర్తి పొందిన స్థానిక గ్రూపులు, ప్రజలు సోషల్ మీడియాలో మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం ఉధృతం అయింది. మార్వాడీల దుకాణాలను, స్వీట్ హౌస్‌లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వారి దగ్గర వస్తువులు కొనవద్దని, ఆహార పదార్థాలు తీసుకోవద్దని ప్రచారం చేస్తున్నారు.