మాస్కు లేకుండా బయటికొస్తే జైలుకే

మాస్కు లేకుండా బయటికొస్తే జైలుకే
  • ఆర్డర్స్ పాస్ చేసిన మధ్యప్రదేశ్, ఒడిషా, కాశ్మీర్
  • ఢిల్లీ, ముంబై సిటీలతో పాటు లడఖ్ లోనూ ఆంక్షలు

న్యూ ఢిల్లీ: వైరస్ ఎఫెక్టు నుంచి సేఫ్ గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ వాడాలని, ఇండ్లలోంచి బయటికి రావొద్దని ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. అయితే ఆదేశాలు పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు బయటికి వస్తున్నారని.. ఢిల్లీ, ముంబై సిటీలతో పాటు, మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలు రూల్స్ ను మరింత కట్టుదిట్టం చేశాయి. మాస్కులు లేకుండా బయటికి వస్తే ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించినట్లేనని, ఐపీసీ 188 సెక్షన్ కింద జైల్లో పెడతామంటూ ఆర్డర్స్ జారీ చేశాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆఫీసర్లు, ఉద్యోగులు, విజిటర్స్ కు మాస్కులు తప్పనిసరి చేస్తూ జమ్మూకాశ్మీర్ యూనియన్ టెర్రిటరీలు ఆదేశాలిచ్చాయి. లడఖ్​లో ఉద్యోగులు, అఫీషియల్స్, ఆర్మీ సిబ్బంది, సెక్యూరిటీ ఫోర్సెస్ తో పాటు జనరల్ పబ్లిక్ కూడా ఇళ్లలోంచి బయటికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాల్పెసిందే అంటూ ఆర్డర్ పాస్ చేసింది.

ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ముంబై మున్సిపల్ కమిషనర్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ఇంటి నుంచి కాలు బయట పెడితే మాస్క్ లేదా కర్చిఫ్ తప్పకుండా వాడాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే వారు జైలు శిక్షకు గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఆదేశాలు ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ పదో రూల్ ప్రకారం జారీ చేసినట్లు తెలిపారు.