భోలక్‌‌పూర్లోభారీ అగ్నిప్రమాదం..15 ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములు బుగ్గిపాలు

భోలక్‌‌పూర్లోభారీ అగ్నిప్రమాదం..15 ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములు బుగ్గిపాలు

 

  •  పక్కనే ఉన్న మూడు ఇండ్లకు మంటలు
  • కాలిపోయిన గృహోపకరణాలు, నిత్యావసరాలు
  • కన్నీరుమున్నీరైన బాధితులు

ముషీరాబాద్, వెలుగు:  ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్​పూర్​లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. డాక్టర్ వారీస్ వీధిలోని అంజుమన్ ఐటీఐ భవనంలో కొనసాగుతున్న 15 ప్లాస్టిక్ స్క్రాప్ గోదాముల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, చూస్తుండగానే భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో గోదాములన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మంటల ధాటికి పక్కనే ఉన్న మూడు భవనాలు పాక్షికంగా దెబ్బతినడమే కాకుండా, కిటికీలు, అద్దాలు కాలిపోయాయి. సుమారు 10 ఫైర్ ఇంజిన్లు, జలమండలి వాటర్ ట్యాంకర్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది సోమవారం ఉదయం 8:30 గంటల వరకు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

భయంతో జనం పరుగులు.. వీధిన పడ్డ కుటుంబాలు

మంటలు ఇండ్లకు వ్యాపించడంతో స్థానికులు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో సుమారు 8 కుటుంబాలకు భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఇండ్లలోని గృహోపకరణాలు, బట్టలు, నిత్యవసర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ముఖ్యంగా అహ్మద్ పాషా అనే బాధితుడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నెల 17న తన కుమారుడి పెండ్లి ఉండటంతో, కూలి పని చేస్తూ దాచుకున్న సుమారు 5 లక్షల రూపాయల విలువైన సామాగ్రి, దుస్తులు కాలి బూడిదయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు.

అక్రమ గోదాములపై కలెక్టర్ సీరియస్

ప్రమాద స్థలాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎం.ఎస్. ప్రియాంక అల సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. జనావాసాల మధ్య కొనసాగుతున్న అనధికార ప్లాస్టిక్ గోదాములపై త్వరలోనే ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.