V6 News

ఐటీ కారిడార్ లో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో ఐదంతస్తుల భవనం 

ఐటీ కారిడార్ లో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో ఐదంతస్తుల భవనం 
  • 90%  గాయాలతో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి పరిస్థితి విషమం  
  • పొగ పీల్చడంతో మరో 11 మందికి అస్వస్థత
  • అగ్నికీలల్లో 12 బైకులు బూడిద

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐదంతస్తుల భవనం మొత్తం మంటలు వ్యాపించి, దట్టంగా పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ఒక సాఫ్ట్ వేర్  ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. మరో 11మంది పొగ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంలో మొత్తం 12 బైకులు కాలిపోగా, మరికొన్ని వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గచ్చిబౌలి టీఎన్ జీఓ కాలనీ అలాయ్ భలాయ్  చౌరస్తా సమీపంలోని జెవి ప్లాజా భవనాన్ని రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి లీజుకు తీసుకొని సాఫ్ట్ వేర్  ఉద్యోగులకు అద్దెకు ఇచ్చాడు.

సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో భవనం సెల్లార్ లో ఉన్న ఎలక్ట్రికల్  ప్యానల్  బోర్డులో షార్ట్  సర్క్యూట్  కారణంగా నిప్పురవ్వలు ఎగిరిపడ్డాయి. ప్యానల్  బోర్డు పక్కనే పాత సోఫాసెట్ ఉండగా, నిప్పు రవ్వలు సోఫా మీద పడి మంటలు అంటుకున్నాయి. సోఫా పక్కనే ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసి ఉండడంతో వాహనాలకూ మంటలు అంటుకొని భవనం మొత్తం వ్యాపించాయి. మెట్ల మార్గం మొత్తం మంటలు, పొగ వ్యాపించడంతో పైఅంతస్తుల్లో ఉన్నవారు భవనంలోనే చిక్కుకుపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. సెల్లార్ లో మంటలను అదుపుచేసి మొదటి అంతస్తులో ఉన్న అద్దాలను పగులగొట్టి భవనం లోపలికి ప్ర వేశించారు. అక్కడ చిక్కుకుపోయిన 16 మందిని రక్షించి కిందకు తీసుకువచ్చారు.  

ఏపీ వాసి పరిస్థితి విషమం

ఏపీలోని గుడివాడ పరిధిలోని గుడ్లవల్లేరుకు చెందిన గాజుల రాజశేఖర్ బాబు (25) ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తూ జెవి ప్లాజా రెండో అంతస్తులోని ఫ్లాట్ నంబరు 202లో మరో నలుగురితో కలిసి నివాసం ఉంటున్నాడు. అగ్నిప్రమాద సమయంలో మంటలు మెట్ల మార్గం మొత్తం వ్యాపించడంతో అందులో నుంచి తప్పించుకుంటుండగా రాజశేఖర్ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 90 శాతం కాలిన గాయాలయ్యాయి. బాధితుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అలాగే ఆ భవనంలో ఉన్న డాక్టర్  అమూల్య(34), సాఫ్ట్ వేర్  ఉద్యోగులు ప్రణీత్ (22), హర్షిత (22), పంకజ్  జిందాల్ (37), సోనమ్  జడోన్ (35), శిల్పా పాండే (24), ఆది పవన్ కుమార్ (25), రాజశేఖర్ (40), రాజేష్(24),  వెంకట్ (25) తో పాటు 7 నెలల ఆరివ్  కేతన్  పొగ పీల్చి అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా ఫైర్ సేఫ్టీ లేకుండా గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లో ఎక్కువ మందికి అద్దెను ఇవ్వడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.