ఆన్‌లైన్ మోసగాళ్ల చేతిలో చిక్కి డబ్బులు పోగొట్టుకున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ప్రజలు డబ్బును తిరిగి వేగంగా చెల్లించేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సరికొత్త ఎస్ఓపీ నిబంధనలను ఆమోదించింది. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ వాడకంలో చురుగ్గా ఉండే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది.
రూ.50 వేల లోపు మోసాలకు కోర్టు ఆర్డర్ అక్కర్లేదు:
సాధారణంగా సైబర్ మోసం జరిగినప్పుడు పోలీసులు నిందితుడి ఖాతాలోని డబ్బును ఫ్రీజ్ చేస్తారు. అయితే ఆ డబ్బును బాధితుడికి తిరిగి ఇవ్వాలంటే కోర్టు ఆర్డర్ తప్పనిసరిగా అవసరం అయ్యేది. దీనివల్ల డబ్బు కోల్పోయిన వ్యక్తులు నెలల తరబడి రీఫండ్ కోసం వేచి చూడాల్సి వచ్చేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై రూ.50వేల లోపు విలువ గల చిన్న తరహా సైబర్ మోసాల్లో కోర్టు ఉత్తర్వులు లేకుండానే బాధితులు రీఫండ్ పొందొచ్చని కేంద్ర ప్రభుత్వం రూల్స్ మార్పులు చేసింది. ఒకవేళ ఎలాంటి కోర్టు స్టే లేకపోతే.. బ్యాంకులు గరిష్టంగా 90 రోజుల్లోపు ఆ మొత్తాన్ని బాధితుడికి తిరిగి చెల్లించేయచ్చు ఇకపై.
తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం:
హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి నగరాల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఈ-కామర్స్ వాడకం చాలా ప్రాంతాల్లో కంటే ఎక్కువే. డిజిటల్ చెల్లింపుల్లో తెలుగు రాష్ట్రాలు ముందువరుసలో ఉండటంతో.. ఇక్కడ సైబర్ ఫిర్యాదులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. గత ఆరేళ్లలో భారతీయులు ఆన్‌లైన్ మోసాల వల్ల దాదాపు రూ.52వేల 976 కోట్లు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తెచ్చిన కొత్త రూల్స్ బాధితుల ఆర్థిక ఇబ్బందులకు వేగంగా ఉపశమనాన్ని అందిస్తాయి.
మోడీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ప్రముఖ క్రిప్టో ఫిన్‌టెక్ సంస్థ జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఈ యూనిఫాం గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం వల్ల డిజిటల్ ఆర్థిక రంగంలో అనిశ్చితి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. పేమెంట్ సంస్థలు, ఎక్స్ఛేంజీలు, బ్యాంకుల మధ్య సమన్వయం పెరుగుతుందని చెప్పారు. దీనివల్ల నిజమైన ఖాతాదారుల ఖాతాలు అనవసరంగా ఫ్రీజ్ అవ్వకుండా ఉంటాయని.. అదే సమయంలో మోసగాళ్లపై వేగంగా చర్యలు తీసుకోవడానికి, బాధితులకు నిధులను త్వరగా తిరిగి పొందటానికి వీలుంటుందన్నారు. ఇది భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు.
కొత్త SOP రూల్స్ ప్రకారం.. బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, స్టాక్ ట్రేడింగ్ యాప్‌లు సైబర్ నేరాలపై ఫిర్యాదు అందగానే ఒక నిర్ణీత కాలపరిమితిలో స్పందించాల్సి ఉంటుంది. ఫిర్యాదుల పరిష్కారం కోసం మూడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2021లో ప్రారంభమైన నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు సుమారు 23 లక్షల ఫిర్యాదులు అందగా.. అధికారుల అప్రమత్తత వల్ల రూ.7వేల 130 కోట్లకు పైగా సొమ్ము మోసగాళ్ల చేతికి వెళ్లకుండా కాపాడబడింది. కొత్త నిబంధనల అమలుతో ఇకపై సైబర్ బాధితులు తమ సొమ్ము కోసం పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి, తక్కువ సమయంలోనే తిరిగి పొందేందుకు వీలు కల్పించబడిందని నిపుణులు అంటున్నారు.
