కాళేశ్వరం ఇసుకతో కాసుల వర్షం.. టీజీఎండీసీ తవ్వకాలతో ప్రభుత్వానికి భారీ ఆదాయం

కాళేశ్వరం ఇసుకతో కాసుల వర్షం.. టీజీఎండీసీ తవ్వకాలతో ప్రభుత్వానికి భారీ ఆదాయం
  • కాళేశ్వరం ఇసుకకు హైదరాబాద్ నుంచి భారీ డిమాండ్
  • ఏటా వందల కోట్ల ఆదాయం
  • మరో మూడు కొత్త క్వారీల ఏర్పాటుకు సన్నాహాలు

గోదావరి పరీవాహక ప్రాంతమైన కాళేశ్వరంలో ఇసుక తవ్వకాలు ప్రభుత్వానికి భారీ ఆదాయ వనరుగా మారుతున్నాయి. టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక విక్రయాలు చేపడుతుండగా ఏటా వందల కోట్ల ఆదాయం సమకూరుతోంది. నాణ్యమైన ఇసుక లభించడం వల్ల హైదరాబాద్‌‌‌‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా డిమాండ్  పెరిగి కాళేశ్వరం ఇసుక క్వారీలు కాసుల పంట పండిస్తున్నాయి. ప్రస్తుతం ఐదు క్వారీల ద్వారా ఇసుక తవ్వకాలు చేపడుతుండగా, మరో మూడు కొత్త క్వారీల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎండీసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం తెస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక విధానాలు, రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ రంగాల వృద్ధితో ఇసుక విక్రయాలు గణనీయంగా పెరిగాయి. తెలంగాణలోనే ప్రత్యేక నాణ్యత కలిగిన కాళేశ్వరం గోదావరి ఇసుకకు మార్కెట్​లో భారీ డిమాండ్ ఉంది. 

హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు లారీల ద్వారా ఇక్కడి నుంచి ఇసుక తరలిస్తున్నారు. ఒకప్పుడు 18 క్వారీల్లో తవ్వకాలు సాగగా ప్రస్తుతం ఐదు క్వారీల్లో మాత్రమే తవ్వకాలు కొనసాగుతున్నాయి. మహదేవపూర్ మండలంలోని బొమ్మాపూర్, ఎలకేశ్వరం, బ్రాహ్మణపల్లి, మహదేవపూర్ పరిధిలోని ఐదు క్వారీల నుంచి తవ్వకాలు జరుగుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 54.66 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.204.6 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 38.12 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయాలు జరిగి రూ.142.5 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం రూ.200 కోట్లకు పైగా ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • కొత్త క్వారీల ఏర్పాటుకు చర్యలు...

మహదేవపూర్, పలిమెల మండలాల్లో కొత్త ఇసుక క్వారీల ఏర్పాటుకు టీజీఎండీసీ అధికారులు చర్యలు చేపట్టారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని పంట పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించాలని రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. పలుగుల, పుసుకుపల్లి, కుంట్లం ప్రాంతాల్లో కొత్త క్వారీల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారు. ఈ మూడు క్వారీలు ప్రారంభమైతే ఇసుక విక్రయాల ద్వారా ప్రభుత్వ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

  • పారదర్శకంగా తవ్వకాలు

ఇసుక తవ్వకాలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నాయి. అక్రమాలకు తావులేకుండా సీసీ కెమెరాలతో నిఘా పెట్టాం. వే బ్రిడ్జిల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది. కొత్త క్వారీల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వచ్చిన వెంటనే కార్యకలాపాలు ప్రారంభిస్తాం.
- టీజీఎండీసీ పీవో రామకృష్ణ