హైదరాబాద్ సిటీ హనుమాన్ నామస్మరణతో మారుమోగనుంది. రేపు( ఏప్రిల్ 2న) నగరంలో నిర్వహించనున్న శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు.
ఏప్రిల్ 2న ఉదయం 11:30 గంటలకు గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 12 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రధాన యాత్ర రాత్రి 8 గంటలకు తడ్బండ్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. ఈ ప్రధాన ర్యాలీలో మరో 14 ఉపయాత్రలు కలవనున్నాయి. అంతేకాకుండా మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో మరో 92 స్థానిక ఊరేగింపులు జరగనున్నాయి.
ట్రాఫిక్ అలర్ట్
యాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా CTO–తడ్బండ్, ECIL, AS రావు నగర్, సైనిక్‌పురి, తార్నాక, హబ్సిగూడ ప్రాంతాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉంది.
RTC బస్సులు, సరుకు రవాణా వాహనాలపై ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయి. యాత్ర సాగే రూట్లలో వాహనాల పార్కింగ్ పూర్తిగా నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను టోయింగ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. భక్తుల సౌకర్యార్థం తడ్బండ్ వద్ద ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
యాత్ర సాఫీగా సాగేందుకు సుమారు 3000 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక, ముఖ్యమైన ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ బలగాలతో పాటు అదనపు సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచుతామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.శోభాయాత్ర నిర్వాహకులకు ఇప్పటికే తగిన సూచనలు జారీ చేశామని, భక్తులు, ప్రజలందరూ పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
