ఓటు  డౌట్(సర్): తప్పులతడకగా 89 లక్షల ఓటర్ కార్డులు..ఇందులో పుట్టిన తేదీ, పేర్ల తప్పులే 16 లక్షలు

ఓటు  డౌట్(సర్): తప్పులతడకగా 89 లక్షల ఓటర్ కార్డులు..ఇందులో పుట్టిన తేదీ, పేర్ల తప్పులే 16 లక్షలు

  తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్​ (సర్​-) ప్రక్రియ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ఈ ప్రక్రియలో 2002 నాటి పాత ఓటర్ల బేస్ డేటాతో ప్రస్తుత రికార్డులను ‘మ్యాపింగ్’ చేయడం, సర్వర్ డౌన్ కావడం, ఓటీపీలు రాకపోవడంలాంటి సాంకేతిక లోపాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆధార్​, ఇతర వివరాల్లో ఉన్న పేర్లు, ఇంటి పేర్లు, పుట్టిన తేదీలు ఓటరు డేటాతో మ్యాచ్​ కాకపోతే యాక్సెప్ట్​ చేయడం లేదు. ఇదిగాక రాష్ట్రంలో ఇప్పటికే  89 లక్షలకుపైగా ఓటర్ల డేటాలో తప్పులు ఉన్నట్టు వాటిని అననామస్​ ఓటర్లుగా ఈసీ గుర్తించింది. సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1.73 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. రెండు రోజుల్లో మిగతా మొత్తం పూర్తి చేయనున్నారు. 

 తెలంగాణలో ఇప్పటికే మొత్తం 89 లక్షలకుపైగా ఓటరు రికార్డుల్లో  తప్పులు ఉన్నట్టు అధికారులు తేల్చారు. ఇవి కాకుండా ధ్రువీకరణ కోసం ఇచ్చే పత్రాల్లో ఉన్నవాటికి ఓటరు కార్డుకు సరిపోలకపోయినా యాప్ యాక్సెప్ట్ చేయడం లేదు.  89 లక్షల ఓటర్లలో అత్యధికంగా 41,52,434 రికార్డుల్లో ఫొటో గుర్తింపు కార్డుల లోపాలు ఉన్నాయి. చాలామంది ఓటర్ల కార్డుల్లో ఫొటోలు మసకగా, నల్లగా ఉండటంతో వాటి స్థానంలో సరికొత్త కలర్ ఫొటోలను అప్‌‌‌‌లోడ్ చేస్తున్నారు.

ఇక పట్టణ ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న సమస్య ఒకే ఇంటి నంబరుపై 10 కంటే ఎక్కువ ఓట్లు ఉండటం. ఈ కేటగిరీ కింద రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 26.14 లక్షల ఓట్లు నమోదై ఉండటంతో బీఎల్ఓలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు. వీటితోపాటు రికార్డుల్లో వయస్సు, పేర్లు, ఇంటిపేర్లు, తండ్రి లేదా భర్త పేర్లు పూర్తిగా తప్పుగా పడి వ్యత్యాసాలున్న ఓటర్లు 16 లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు.