యూరప్లో భీకర కార్చిచ్చు.. 2.5 లక్షల మంది తరలింపు.. అంతర్జాతీయ సాయం కోరిన దేశాలు

యూరప్లో భీకర కార్చిచ్చు.. 2.5 లక్షల మంది తరలింపు.. అంతర్జాతీయ సాయం కోరిన దేశాలు
  • జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించిన స్పెయిన్
  • లక్షలాది హెక్టార్ల అటవీ ప్రాంతం బూడిద

మాడ్రిడ్/పారిస్: యూరప్ దేశాలైన స్పెయిన్, ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ను భీకర కార్చిచ్చు తీవ్రంగా వణికిస్తోంది. భారీ మంటల కారణంగా వేలాది ఇండ్లు, హాలిడే రిసార్ట్‌‌‌‌‌‌‌‌లు పూర్తిగా బూడిదయ్యాయి. ఇరు దేశాల్లో కలిపి మొత్తం 2.5 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ సమీపంలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అయితే, బలమైన ఈదురుగాలుల వల్ల మంటలు మరింత విస్తరిస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మాడ్రిడ్ ప్రాంతంలో దాదాపు 10,000 హెక్టార్లు, పొరుగునే ఉన్న అవిలా ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లో 13,000 నుంచి 15,000 హెక్టార్ల అడవి కాలిపోయింది. పారిస్ విస్తీర్ణానికి రెట్టింపు కంటే ఎక్కువ విస్తీర్ణంలో మంటలు వ్యాపించడంతో 70 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పష్టం చేశారు.

ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌లోనూ ఆందోళనకర పరిస్థితి..

ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌లోనూ కార్చిచ్చు ఉధృతి కొనసాగుతోంది. బోర్డో నగర శివారు ప్రాంతాల నుంచి వేలాది మందిని అధికారులు ఖాళీ చేయించారు. కుప్ ఫెరెట్ ద్వీపకల్పం నుంచి దాదాపు 44 వేల మంది ప్రజలు తరలివెళ్లగా, రోడ్డు మార్గం మూసుకుపోవడంతో బోట్ల ద్వారా వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. జిరాండే, ల్యాండె ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 1.97 లక్షల మందిని ఖాళీ చేయించినట్లు ఫ్రెంచ్ ప్రధాని సెబాస్టియన్ లెకార్ను తెలిపారు. 

ఈయూ సాయం కోరిన ఫ్రాన్స్..

పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ యూరోపియన్ యూనియన్‌‌‌‌‌‌‌‌ను సహాయం కోరారు. సహాయక చర్యల కోసం సైనిక రవాణా విమానంతో పాటు పారిస్ నుంచి 100 మంది అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. ఫ్రాన్స్ వ్యాప్తంగా కార్చిచ్చు దాదాపు 98 వేల హెక్టార్లను కాల్చి బూడిద చేసిందని, ఇది చారిత్రాత్మక రికార్డు అని ఫ్రెంచ్ అంతర్గత మంత్రి లారెంట్ నునేజ్ పేర్కొన్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడిన కరువు ఈ ఏడాది కార్చిచ్చుల ముప్పును మరింత పెంచిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.