
క్రికెట్ లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. క్రికెట్ లో తొలి మ్యాచ్ నుంచి వీరి మధ్య సమరం ఇప్పటికీ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. నవంబర్ 21 నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియాలో జరగనుంది. 1882లో తొలిసారి యాషెస్ సిరీస్ జరిగింది. ప్రతి రెండేళ్లకోసారి ఈ ప్రతిష్టాత్మక సిరీస్ వచ్చినప్పుడల్లా క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. సొంతగడ్డపై జరగబోయే ఈ టెస్ట్ సిరీస్ ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. మరోవైపు 2015 నుంచి యాషెస్ గెలవని ఇంగ్లాండ్ ఎలాగైనా ఆసీస్ కు షాక్ ఇవ్వాలని చూస్తోంది.
ఈ మెగా సిరీస్ కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నపటికీ ఇప్పటి నుంచే బజ్ స్టార్ట్ అయింది. ఇరు జట్ల మాజీలు తమ జోస్యాన్ని చెబుతూ యాషెస్ హీట్ పెంచేశారు. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఒక విచిత్రమైన బెట్ వేశాడు. ఈ బెట్ ఎవరో గెలుస్తారో కాదు.. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ పై. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న రూట్ రానున్న యాషెస్ సిరీస్ లో సెంచరీ చేయకపోతే తాను మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో నగ్నంగా నడుస్తానని బోల్డ్ కామెంట్స్ చేశాడు. హేడెన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. అతని స్టేట్ మెంట్ కు నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
టెస్ట్ క్రికెట్ కెరీర్ లో ఇప్పటివరకు 39 సెంచరీలు చేసిన రూట్.. ఆస్ట్రేలియా గడ్డపై ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం ఆశ్చర్యకరం. కేవలం టెస్టుల్లోనే కాదు ఆస్ట్రేలియాలో వన్డే, టీ20ల్లోనూఈ ఇంగ్లాండ్ స్టార్ కు శతకం లేదు. ఇప్పటివరకు 14 మ్యాచ్ ల్లో ఒక్క సెంచరీ కూడా లేదు. రూట్ తన కెరీర్‌లో ఆస్ట్రేలియాపై నాలుగు సెంచరీలు చేశాడు. ఈ నాలుగు సెంచరీలు ఇంగ్లాండ్‌లోనే చేశాడు. 34 ఏళ్ల రూట్ ఓవరాల్ గా ఆస్ట్రేలియాపై 34 టెస్టుల్లో 40.46 యావరేజ్ తో 2428 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
►ALSO READ | సౌతాఫ్రికా బోణీ.. తొలి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ పై గెలుపు
చివరిసారిగా ఇంగ్లాండ్ లో జరిగిన యాషెస్ 2-2 తో సమమైంది. తొలి రెండు టెస్టులు ఆస్ట్రేలియా గెలిస్తే చివరి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ రెండు టెస్టులు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. అంతకముందు 2021-22 యాషెస్ లో ఆస్ట్రేలియా 4-0తో గెలిచింది. ఆస్ట్రేలియా చివరి 15 స్వదేశీ టెస్టుల్లో రెండింటిలో మాత్రమే ఓడిపోయింది. ఓవరాల్ గా ఇప్పటి వరకూ చరిత్రలో మొత్తం 330 యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 136 టెస్టులు, ఇంగ్లండ్ 108 టెస్టులు గెలవగా.. 91 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇటీవలే ఇండియాతో ఇంగ్లాండ్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా వెస్టిండీస్ పై 3-0 తేడాతో గెలిచింది.