మౌయ్ కార్చిచ్చు ఈ శతాబ్దంలో అత్యంత ఘోరమైనది..89కి చేరిన మృతుల సంఖ్య

మౌయ్ కార్చిచ్చు ఈ శతాబ్దంలో అత్యంత ఘోరమైనది..89కి చేరిన మృతుల సంఖ్య

మౌయ్ లో చెలరేగిన కార్చిచ్చుకు బలైన వారి సంఖ్య 89కి చేరింది. ఈ శతాబ్దంలో ఇదే అత్యంత ఘోర కార్చిచ్చుగా అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లహౌనా శిథిలాల కింద మరణించిన వారి జాడ కోసం జల్లెడ పడుతున్నారు. చారిత్రక రిసార్ట్ లతో పర్యాటకులను ఆకర్షించే పట్టణంలో శిథిలమైన భవనాలు, మంటల్లో కరిగిపోయిన కార్ల, ఇతర వాహనాల ఆనవాళ్లు..నాలుగు రోజుల తర్వాత నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులకు కార్చిచ్చు సృష్టించిన బీభత్సానికి  సాక్ష్యాలుగా నిలిచాయి. యూఎస్ చరిత్రలో హవాయి అడవుల్లో చెలరేగిన కార్చిర్చు అత్యంత ఘోరమైన ప్రమాదంగా నిలిచింది. గురువారం చెలరేగిన మంటలు ఇప్పటి వరకు 89 మందిని సజీవ దహనం చేశాయి. 

ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ(FEMA) కార్చిచ్చు నష్టాన్ని ఆదివారం అంచనా వేసింది. FEMA అంచనా ప్రకారం...2వేల 200 లకు పైగా కట్టడాలు ధ్వంసమయ్యాయి. సుమారు 21వేల ఎకరాల్లో అడవి కాలిపోయింది. లహైనా పునర్నిర్మాణానికి 5.5 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని ఫెమా అంచనా వేసింది. మృతదేహాలను గుర్తించేందుకు శిక్షణ పొందిన కుక్కలను రంగంలోకి దింపామని మౌయి కౌంటీ పోలీస్ చీఫ్ జాన్ పెల్లెటియర్ తెలిపారు.  ప్రకృతి విపత్తులపై అలెర్ట్ చేసేందుకు ద్వీపం చుట్టూ సైరన్‌లు ఉన్నా.. అవి వినిపించకపోవడంతో ప్రమాదం నష్టం అంచనా ఎక్కువగా ఉందన్నారు. విద్యుత్ అంతరాయం, సెల్యులార్ అంతరాయాల కారణంగా సైరన్ మోగలేదని అధికారులు గుర్తించారు. 

కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ వైఫల్యం, హరికేన్ నుంచి గంటకు 130 కి.మీ. వేగంతో వీచే గాలులు..అడవి అంటిన మంటలకు తోడు కావడంతో కార్చిచ్చు అత్యంత వేగంగా వ్యాపించడానికి కారణమయ్యాయిని అధికారులు తెలిపారు. మంటలు ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నించిన లాభం లేకుండా పోయిందని అన్నారు.