మహా హైదరాబాద్‌ కల సాకారమైంది.. సీఎం సంచలన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం

మహా హైదరాబాద్‌ కల సాకారమైంది.. సీఎం సంచలన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం
  • మేయర్​విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్​ శ్రీలత
  • బల్దియా హెడ్డాఫీసులో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ
  • ఏండ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెర 

హైదరాబాద్ సిటీ, వెలుగు: అర్బన్ లోకల్ బాడీలు కలిపి ఒకే మహా హైదరాబాద్​గా మార్చాలనే  కల సాకారమైందని, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ,  అంబేద్కర్ విగ్రహాలను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతతో కలిసి ఆవిష్కరించారు. మేయర్ గేటు ఎదుట ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్​సహా పలు సుందరీకరణ పనులను ప్రారంభించారు.

 మేయర్ మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం, హెడ్డాఫీసుకు కార్పొరేట్ లుక్ వచ్చేలా సుందరీకరణ పనులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగ సంఘాల లీడర్ల సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 

అతి పెద్ద మెట్రోపాలిటన్​నగరం

27 లోకల్ బాడీల విలీన నిర్ణయంతో 650 చదరపు కిలో మీటర్ల నుంచి 2 వేల చదరపు కిలోమీటర్ల మేర జీహెచ్ఎంసీ  విస్తరించిందని మేయర్​తెలిపారు. హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా అవతరించిందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న  జీహెచ్ఎంసీలో లోకల్ బాడీలు భాగం కావడం వల్ల ఇకపై హైదరాబాద్ తో సమానంగా విలీన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రజలు వేగంగా, సులభంగా సేవలు పొందగలుగుతారని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద మహా నగరం హైదరాబాద్ కు మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఉండడం తమకు గర్వ కారణమన్నారు. డిప్యూటీ మేయర్ శ్రీలత మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలో ఏకకాలంలో 27 పురపాలికలు విలీనం కావడం సంతోషంగా ఉందన్నారు. మరోవైపు రోశయ్య వర్ధంతి సందర్భంగా జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్​లో ఆయన ఫొటోకు మేయర్, డిప్యూటీ మేయర్ వేసి  నివాళులర్పించారు.