హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ 2026–-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మేనేజ్మెంట్ కోటాలోని బీ, సీ(ఎన్ఆర్ఐ) కేటగిరీల ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల మాప్-అప్ విడత సీట్ల కేటాయింపు లిస్టును శనివారం కాళోజీ వర్సిటీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 ప్రైవేట్ మెడికల్, 11 డెంటల్ కాలేజీల్లో మొత్తం 3,158 మంది అభ్యర్థులకు నీట్ మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయించారు.
ఈ లిస్టులో సీట్లు పొందిన విద్యార్థులు తమ అలాట్మెంట్ ఆర్డర్, ఒరిజినల్ సర్టిఫికెట్లు, నిర్దేశిత ట్యూషన్ ఫీజు రశీదుతో ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటల్లోపు సంబంధిత కాలేజీల్లో తప్పనిసరిగా రిపోర్ట్ చేసి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలని వర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.
