కరోనా కాలంలో అంబులెన్స్ దొంగతనం

కరోనా కాలంలో అంబులెన్స్ దొంగతనం

రిపేర్ చేసిన డబ్బులివ్వలేదని.. దొంగతనం చేసిన మెకానిక్

అత్యవసర సేవల కోసం ఉపయోగించే 102 వాహనాన్నే దొంగలు అపహరించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. వాహనానికి మరమ్మతులు చేస్తానంటూ నమ్మబలికి వాహనంతో ఉడాయించాడు ఓ దొంగ. పోలీసులు అలెర్ట్ కావడంతో వాహనం వదిలేసి పరారయ్యాడు. అయితే బండి రిపేరు చేసిన డబ్బులు ఇవ్వకపోవడంతోనే మెకానిక్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడి కావడంతో అందరూ అవాక్కయ్యారు.

గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల అమ్మఒడి వాహనానికి రెండు నెలల క్రితం రిపేర్ చేయించారు. అయితే ఆ రిపేర్ కు సంబంధించిన డబ్బులు మెకానిక్ కు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో విసిగిపోయిన మెకానిక్ వాహనాన్నే దొంగతనం చేశాడు. సోమవారం మధ్యాహ్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న 102 వాహనం దగ్గరికొచ్చిన మెకానిక్.. తాను అత్యవసర సేవలందించే ప్రభుత్వ వాహనాలు రిపేర్ చేస్తుంటానని డ్రైవర్ కు చెప్పాడు. ఈ వెహికిల్ ను ఓసారి ట్రయల్ వేయాలని చెప్పడంతో.. డ్రైవర్ బండి తాళాలను దొంగచేతిలో పెట్టాడు. ట్రయల్ కు వెళ్లిన మెకానిక్ ఎంతకీ రాకపోవడంతో.. అనుమానపడ్డ డ్రైవర్ స్థానిక పోలీసులను సంప్రదించాడు. అప్రమత్తమైన పోలీసులు సమీప పోలీసు స్టేషన్లకు కూడా సమాచారం అందించారు. ఇల్లందు, మహబూబాబాద్ రహదారి గుండా 102 వాహనం వెళ్లడం గమనించిన పోలీసులు.. దొంగలను వెంబడించడంతో ఇల్లందు మండలం రొంపేడు వద్ద వాహనాన్ని రహదారిపైనే వదిలి ఉడాయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

వాట్సాప్‌ పేమెంట్స్‌‌ వచ్చేస్తోంది!

రెస్టారెంట్ వినూత్న ప్రయోగం.. కోవిడ్ కర్రీ, మాస్క్ నాన్స్

ముంబైలో బతకడం సేఫ్ కాదు.. మాజీ సీఎం భార్య