యువతలోని ప్రతిభను వెలికితీయడానికే యువజనోత్సవాలు

యువతలోని ప్రతిభను వెలికితీయడానికే యువజనోత్సవాలు

మెదక్​ టౌన్​, వెలుగు : యువతను ప్రోత్సహించి వారి శక్తిని దేశాభివృద్ధికి ఉపయోగపడేలా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో మెదక్​ పట్టణంలోని టీఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన 2023- జిల్లా స్థాయి యువజనోత్సవాలను ఆమె  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలోని ప్రతిభను వెలికితీయడానికి యువజనోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. యువత మంచి ప్రదర్శన కనపరిచి రాష్ట్ర స్థాయిలో మెదక్ జిల్లాకు పేరు తేవాలని కోరారు. అనంతరం విజేతలకు మెమొంటోలు అందజేశారు. జాతీయ నేతల వేషధారణతో వారిని అభినయిస్తూ సాగిన రూపకాలు,  బృందగానాలు, డ్యాన్స్‌‌‌‌‌‌‌‌లతో  ప్రాంగ ణం మారుమోగింది. ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి కూడా స్టేజీపైకి వెళ్లి విద్యార్థినులతో కలిసి డ్యాన్స్​ చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో  జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు,  మెదక్​ మున్సిపల్​ చైర్మన్​ చంద్రపాల్,  వైస్ చైర్మన్​ మల్లికార్జున్ గౌడ్, జడ్పీ వైస్​ చైర్​పర్సన్ ​లావణ్య, జిల్లా స్పోర్ట్స్ అధ్యక్షుడు మహమ్మద్ జుబేర్ అహ్మద్, కో --ఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

క్యాలెండర్​, డైరీని ఆవిష్కరణ 

మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో మంగళవారం టీపీటీఎఫ్​ క్యాలెండర్​, డైరీలను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్​ చైర్​పర్సన్​ లావణ్య, టీపీటీఎఫ్​  జిల్లా అధ్యక్షుడు పీ.సంగయ్య , ప్రధాన కార్యదర్శి పీ.వెంకట్ రామ్ రెడ్డి 
పాల్గొన్నారు.

ముగిసిన పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్

సిద్దిపేట రూరల్, వెలుగు : పదిరోజులుగా జరుగుతున్న పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై  ఫిజికల్ ఈవెంట్స్ మంగళవారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 9983 అభ్యర్థులకు గాను, 8742 అభ్యర్థులు ఈవెంట్స్ కు హాజరు కాగా, 4360 అభ్యర్థులు ఫిజికల్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించారు. 1241 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కాగా పురుష అభ్యర్థులు 3185, మహిళా అభ్యర్థులు 1175  మంది అన్ని విభాగాలలో ఉత్తీర్ణత పొంది తుది పరీక్షకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా సీపీ ఎన్.శ్వేత మాట్లాడుతూ జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, పీఈటీ టీచర్లు, సాంకేతిక నిపుణుల సహకారంతో ప్రశాంతంగా పరీక్షలు పూర్తి చేశామని తెలిపారు. 49.87 శాతం అభ్యర్థులు మైదానంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి తుది రాత పరీక్షకు ఎంపికైనందుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. నియామక ప్రక్రియ సాఫీగా నిర్వహించడానికి కృషి చేసిన అడిషనల్ డీసీపీ మహేందర్, రిజర్వ్ ఇన్స్​పెక్టర్ శ్రీధర్ రెడ్డి,  సిద్దిపేట రూరల్ సీఐ జానకీరామ్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈవెంట్స్ లో పాల్గొన్న పోలీస్ అధికారులకు, పీఈటీ టీచర్లకు, టెక్నికల్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. 

బీజేపీలో అసమ్మతి ఉండదు

దుబ్బాక, వెలుగు: దేశం కోసం, ధర్మం కోసం పని చేసే బీజేపీలో అసమ్మతి రాగాలు ఉండవని, ఒకవేళ ఉంటే సోషల్​ మీడియా వేదికగా బీఆర్ఎస్​ సృష్టిస్తోన్న కుట్ర అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల రోశయ్య, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు పోతరాజు భిక్షపతి ఆరోపించారు. మంగళవారం దుబ్బాక, దౌల్తాబాద్​ మండల కేంద్రాల్లో వారు మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. అనారోగ్యానికి గురైన మాజీ ఎమ్మెల్యే వాసు రెడ్డిని దుబ్బాక ప్రాంతానికి చెందిన కొంతమంది బీజేపీ నాయకులు పరామర్శించడానికి వెళ్తే బీజేపీలో అసమ్మతి రాజుకుంటుందని బీఆర్​ఎస్​నాయకులు ఫేక్​ వీడియోలు, ఫేక్​ మాటలు పెట్టి సోషల్ ​మీడియాలో ప్రచారం చేయడం తగదన్నారు. పరామర్శించడానికి వెళ్లిన వ్యక్తులు గ్రూప్​ ఫొటో తీసుకుంటే అది అసమ్మతి నేతల మీటింగ్​అని చెప్పడం, దానికి బీఆర్​ఎస్​తోక పత్రికలు రాయడమేంటని ప్రశ్నించారు. జాతీయ భావంతో పని చేస్తోన్న బీజేపీలో సమ్మతి తప్ప అసమ్మతి అనే మాట ఉండదన్నారు. నియోజకవర్గంలోని క్షేత్ర స్థాయి కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే రఘునందన్​రావు వెంటే ఉంటామని, దుబ్బాక నియోజకవర్గంలో మరొక్కసారి బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సోషల్​ మీడియా వేదికగా అనవసర ఆరోపణలు చేస్తోన్న బీఆర్​ఎస్​ నాయకులు వెంటనే బీజేపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ ​చేశారు. కార్యక్రమంలో దౌల్తాబాద్​ మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్, కుమ్మరి నర్సింలు, గడ్డమీది స్వామి, భిక్షపతి, కృష్ణ భాస్కర్​, ప్రవీణ్, సంపంగి అశోక్​, రమేశ్​రెడ్డి ఉన్నారు. 

సిద్దిపేట ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ దేశానికే ఆదర్శం

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట ఇంటిగ్రేటెడ్​మార్కెట్ దేశానికే ఆదర్శమని, ప్రజా ఆరోగ్య రక్షణకు నిదర్శనమని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు అన్నారు. మంగళవారం సిద్దిపేట ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ ను మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత వేణుగోపాల్ రెడ్డి, పాలకమండలి సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట మార్కెట్ యార్డ్ అద్భుతంగా ఉందని, ఇక్కడి సౌకర్యాలు, పరిసరాల, వ్యక్తి గత పరిశుభ్రత చాలా బాగా ఉందని అన్నారు. మంత్రి హరీశ్ రావు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం దుమ్ము ధూళి లో కాకుండా స్వచ్ఛమైన కూరగాయలు అందించాలని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించారన్నారు. కార్యక్రమంలో బృందం ప్రతినిధులు వికాస్ మిశ్రా, విజయ్ కుమార్, జ్యోతిర్మయి, ఎం ఏ కలీల్, ధర్మేంద్ర, కృష్ణ మూర్తి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, దరిపల్లి శ్రీను, చైతన్య, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

‘గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం’

పాపన్నపేట/నర్సాపూర్, వెలుగు : గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులను సర్పంచులకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం దొంగచాటున కాజేస్తూ పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందని మెదక్​ జిల్లా కిసాన్​ సెల్​ అధ్యక్షుడు ప్రభాకర్​రెడ్డి, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి  ఆంజనేయులు గౌడ్ మండిపడ్డారు. టీపీసీసీ పిలుపు మేరకు మంగళవారం మండల పాపన్నపేట, నర్సాపూర్​లో ర్యాలీ నిర్వహించే రోడ్డుపై ధర్నా చేశారు. పాపన్నపేటలో సీఎం కేసీఆర్​దిష్టిబొమ్మను దహనం చేయబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభాకర్​రెడ్డితోపాటు ఎంపీటీసీలు ఆకుల శ్రీనివాస్, రమేశ్, మైనార్టీ మండల అధ్యక్షుడు కలీం, తదితర నేతలను అరెస్టు చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా పాపన్నపేటలో​లో ప్రభాకర్​రెడ్డి, నర్సాపూర్​లో ఆంజేయులు గౌడ్​ మాట్లాడుతూ ప్రభాకర్​రెడ్డి మాట్లాడుతూ అరెస్టులు చేసినా ఆందోళనలకు వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్​నిరంకుశ పాలనతో గ్రామాలు కుంటుపడుతున్నాయని ఆరోపించారు. గ్రామ పంచాయతీ నిధులను డిజిటల్​కీ ద్వారా లాక్కోవడం ఎంత వరకు 
సమంజసమన్నారు. 

టీఎల్ఎంతో బోధన సులభతరం 

జగదేవపూర్, వెలుగు : టీచింగ్ లార్నింగ్ మేటిరియల్ (టీఎంఎల్) తో విద్యార్థులకు అర్థమయ్యేలా సులభంగా బోధన చేయడానికి  అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి అన్నారు. మంగళవారం జగదేవపూర్ మండల కేంద్రంలో మండల స్థాయి టీఏల్ఏం మేళా నిర్వహించారు.  వివిధ ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు తయారు చేసిన టీఎల్ఎంలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు కార్పొరేట్​కు దీటుగా నాణ్యమైన విద్య అందుతోందన్నారు.  మన ఊరు మన బడితో స్కూళ్లలోని సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, నాచారం దేవస్థానం డైరెక్టర్ బుద్ధ నాగరాజు, ఎంపీటీసీ లు ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, పీఆర్ టీయూ, టీపీటీఎఫ్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు. 

కోహెడ, వెలుగు : మండల పరిధిలోని శనిగరం హైస్కూల్​లో నిర్వహించిన మండల స్థాయి టీఎల్​ఎం ప్రదర్శన మేళాకు సిద్దిపేట ట్రైనింగ్​ అసిస్టెంట్​ కలెక్టర్​ ఫైజాన్​ అహ్మద్​ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ స్టూడెంట్స్​కు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా టీఎల్​ఎంలను తయారు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ శ్యామల, ఎంఈవో పావని, నోడల్​ఆఫీసర్ విజయ హోహన్, సెక్టోరియల్​ఆఫీసర్​భాస్కర్, సర్పంచ్ జయశ్రీ  ఉన్నారు. 

సీఎస్​ఆర్​ కింద స్కూల్​కు రూ.2.28 కోట్లు

మెదక్ (శివ్వంపేట), వెలుగు : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్​ఆర్)​ కింద సింగరేణి యాజమాన్యం శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల జడ్పీ హైస్కూల్​కు రూ.2.28 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో మంగళవారం సింగరేణి యాజమాన్య ప్రతినిధులు, డీఈఓ రమేశ్​కుమార్, ఎంఈఓ బుచ్యా నాయక్, పంచాయతీరాజ్​ఏఈ భాస్కర్​ స్కూల్​ను సందర్శించిసమస్యలు ఏమున్నాయి.. ఏఏ పనులు చేపట్టాలనేది పరిశీలించారు. సీఎస్​ఆర్​ ఫండ్స్​తో అడిషనల్​ క్లాస్​ రూంల​తోపాటు, బాస్కెట్​బాల్, వాలీబాల్ గ్రౌండ్, ఖోఖో, కబడ్డీ గ్రౌండ్,  స్కూల్​ప్రాంగణంలోనే అంగన్​ వాడీ స్కూల్​ బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టనున్నట్టు వారు తెలిపారు.