కొలువుదీరిన తల్లులు.. చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెపైకి చేరిన సమ్మక్క

కొలువుదీరిన తల్లులు.. చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెపైకి చేరిన సమ్మక్క

తల్లీబిడ్డలను దర్శించుకుని పులకించిన భక్తజనం
జెండాగుట్ట కంకవనం ప్రతిష్టాపనతో పూజలు షురూ
సాయంత్రం 6:55 గంటలకు చిలుకలగుట్ట నుంచి పయనమైన సమ్మక్క 
గౌరవ సూచకంగా గాల్లోకి తుపాకీ పేల్చిన ఎస్పీ సుధీర్‌‌ రాంనాథ్‌‌ కేకన్‌‌
స్వాగతం పలికిన మంత్రి సీతక్క, కలెక్టర్‌‌ దివాకర టీఎస్‌‌

వరంగల్‌‌/ములుగు/తాడ్వాయి, వెలుగు: మేడారం గద్దెలపై వన దేవతలు కొలువుదీరారు. బుధవారం బిడ్డ సారలమ్మ రాగా.. గురువారం తల్లి సమ్మక్క రాకతో భక్తులు పులకించిపోయారు. ‘జై సమ్మక్క.. జైజై సారక్క’ అంటూ తల్లులను తలుచుకున్నారు. చిలుకలగుట్ట నుంచి దిగివచ్చిన సమ్మక్కకు లక్షలాది మంది జనం జయజయధ్వానాలతో స్వాగతం పలికారు. 

తల్లి రాకను సూచిస్తూ ములుగు ఎస్పీ సుధీర్‌‌ రాంనాథ్‌‌ కేకన్‌‌ గాల్లోకి కాల్పులు జరపగా.. మంత్రి సీతక్క, కలెక్టర్‌‌ దివాకర టీఎస్‌‌ స్వాగతం పలికారు. మేడారం వైపు బయలుదేరిన సమ్మక్కకు ఎదురుగా భక్తులు కోళ్లను ఎగురవేసి, యాటలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క తల్లిని తీసుకొచ్చే ఘట్టానికి ముందు సమ్మక్క పూజారి అయిన సిద్ధబోయిన మునీందర్‌‌ ఇంటి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలు వాయిద్యాలు, సన్నాయి మేళాలతో జెండా గుట్టకు చేరుకున్నారు. సమ్మక్క తమ్ముడైన వనం పోతురాజు (కంకవనం)ను తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా గద్దెలకు చేర్చారు. 

సమ్మక్క, సారలమ్మల గద్దెలపై పసుపు, కుంకుమ, చీరెసారెలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం గోవిందరాజు, పగిడిద్దరాజులకు పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, గురువారం వన దేవతలను కేంద్ర మంత్రులు కిషన్‍రెడ్డి, జుయెల్​ఓరం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌‌ దర్శించుకున్నారు.

మేడారంలో సమ్మక్క తల్లిని తీసుకువచ్చే ఘట్టానికి ముందు సమ్మక్క పూజారి అయిన సిద్దబోయిన మునీందర్‌‌‌‌ ఇంటి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలు వాయిద్యాలు, సన్నాయి మేళాలతో జెండా గుట్టకు చేరుకున్నారు. సమ్మక్క తమ్ముడైన వనం పోతురాజు (కంకవనం)ను తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా గద్దెలకు చేర్చారు. 

సమ్మక్క తల్లిని చిలుకలగుట్ట నుంచి తీసుకురావడానికి ముందు పూజారులు మేడారంలోని సమ్మక్క గుడికి వెళ్లారు. పూజల అనంతరం సిద్ధబోయిన మునీందర్‌‌ ఇంటి వద్ద ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అడేరా లు (కొత్త కుండలు) పూజా సామగ్రితో అమ్మవారి గద్దెల వద్దకు చేరుకొని అలుకుపూతలు చేశారు. సాయంత్రం 5 గంటలకు సమ్మక్క ప్రధాన (వడ్డెలు) పూజారులైన కొక్కెర కృష్ణయ్య, మునీందర్, జలకం వడ్డె మల్లెల సత్యం, దీపధూపాల వడ్డె దోబె నాగేశ్వర్‌‌రావుతో సహా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ద బోయిన జగ్గారావు ఆధ్వర్యంలో చిలుకలగుట్టకు వెళ్లి సుమారు రెండు గంటల పాటు రహస్య పూజలు చేశారు. తర్వాత పసుపు, కుంకుమ రూపంలో ఉన్న అమ్మవారిని కుంకుమ భరిణెలో పెట్టుకొని కొక్కెర కృష్ణయ్య గుట్టపై నుంచి కిందికి దిగారు. చలపయ్య చెట్టు వద్దకొచ్చాక.. జలకం చల్లి దీపధూప నైవేధ్యాలతో తల్లిని జనాల్లోకి తీసుకొచ్చారు.

నాలుగంచెల భద్రత..

సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చే క్రమంలో పోలీసులతో నాలుగంచెల భద్రత ఏర్పాటు చేశారు. తల్లికి ప్రతిరూపంగా భావించే పూజరులను తాకాలని భక్తులు ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో పూజరులకు ఇబ్బంది తలెత్తకుండా ఎస్పీలు, అడిషనల్‌‌ ఎస్పీలు, డీఎస్పీలు వంటి 25 మంది ఆఫీసర్లు స్వయంగా బందోబస్తులో పాల్గొన్నారు. 

పూజారుల చుట్టూ 100 మంది పోలీసులు తాడుతో వలయంగా ఉన్నారు. వీరికి ముందు వెనకాల మరో 20 చొప్పున రూట్‌‌ క్లియర్‌‌ చేసే పని చేపట్టారు. వీరే కాకుండా కిలోమీటరున్నర మార్గంలో మరో 300 మంది పోలీసులు ట్రాఫిక్‌‌ క్లియర్‌‌ చేయడంలో పాల్గొన్నారు. మరో వైపు తుడుందెబ్బ టీం, ఆదివాసీ యువత పూజారుల చుట్టూ భద్రతా వలయంగా ఏర్పడ్డారు.