మహిళా భక్తులు ‘మహాలక్ష్మి’లో వెళ్లండి.. మేడారం జాతర కోసం 4 వేల బస్సులు

మహిళా భక్తులు ‘మహాలక్ష్మి’లో వెళ్లండి.. మేడారం జాతర కోసం 4 వేల బస్సులు
  • అమ్మవార్ల గద్దెల దాకా తీసుకెళ్లే సదుపాయం 
  • రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

హుస్నాబాద్,వెలుగు:  మేడారం జాతరకు వెళ్లే అక్కాచెల్లెళ్లందరూ ‘మహాలక్ష్మి’ ఫ్రీ బస్సులో ప్రయాణించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.  భక్తుల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 4 వేల ఆర్టీసీ బస్సులను మేడారం నడుపుతున్నట్లు తెలిపారు. బుధవారం హుస్నాబాద్ లోని క్యాంపు ఆఫీసులో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

ఆర్టీసీ బస్సులను నేరుగా అమ్మవార్ల గద్దెల ప్రాంగణం వరకు అనుమతిస్తున్నట్టు, ప్రైవేట్ వాహనాలకు చాన్స్ లేదని పేర్కొన్నారు.  దర్శనాంతరం భక్తులను సురక్షితంగా మళ్లీ గమ్యస్థానాలకు చేర్చేలా పకడ్బందీ ప్లాన్ చేశామని చెప్పారు.  మేడారంలో 50 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్ ఏర్పాటు చేశామని, 9 కిలోమీటర్ల పొడవుతో 50 క్యూలైన్లు ఉన్నాయని,  ఒకేసారి 20 వేల మంది వేచి ఉండే వీలుందని వివరించారు. 

ప్రయాణికుల కోసం బస్ స్టేషన్ల వద్ద తాగునీరు, ఉచిత వైద్య శిబిరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కంట్రోల్ రూమ్ ద్వారా క్షేత్రస్థాయిలో ఆర్టీసీ సిబ్బంది 24 గంటలు పర్యవేక్షిస్తుంటారని, సిబ్బంది విశ్రాంతి కోసం ప్రత్యేక షెడ్లు కూడా నిర్మించామని మంత్రి తెలిపారు.