రూల్స్ పాటించని 55 ఐవీఎఫ్ సెంటర్లు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 381 కేంద్రాల్లో వైద్యశాఖ తనిఖీలు

రూల్స్ పాటించని 55 ఐవీఎఫ్ సెంటర్లు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 381 కేంద్రాల్లో వైద్యశాఖ తనిఖీలు
  • బయటపడిన లోపాలు.. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కు నివేదిక
  • ముందు షోకాజ్​ నోటీసులు.. ఆ తర్వాత కఠిన చర్యలు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చాలా ఐవీఎఫ్​ సెంటర్లు నిబంధనలను పాటించడంలేదని వైద్య ఆరోగ్య శాఖ తనిఖీల్లో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 381 ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు చేయగా అందులో 55 సెంటర్లు రూల్స్ పాటించట్లేదని తేల్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 35 బృందాలు 271 సెంటర్లలో తనిఖీలు నిర్వహించగా, జిల్లాల్లో డీఎంహెచ్​ఓల ఆధ్వర్యంలో ఇన్​స్పెక్షన్స్​ చేపట్టారు. ఈ తనిఖీలు ఇటీవలే ముగియడంతో అధికారులు ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కు నివేదిక అందజేశారు.

 ఫెర్టిలిటీ, సరోగసీ సెంటర్లు అసిస్టెడ్‌‌‌‌ రీప్రొడక్టివ్‌‌‌‌ టెక్నాలజీ రెగ్యులేషన్‌‌‌‌ యాక్ట్ 2021, సరోగసీ (రెగ్యులేషన్‌‌‌‌) యాక్ట్ 2021, క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. తనిఖీల్లో చాలా సెంటర్లు ఇవేమీ పాటించడం లేదని అధికారులు గుర్తించారు. ఇటీవల సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసి పేరుతో చేసిన మోసం, చైల్డ్ ట్రాఫికింగ్ వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లలోతనిఖీలు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించిన విషయం తెలిసిందే. 

ఉల్లంఘనలు హైదరాబాద్ లోనే  ఎక్కువ

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 381 ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా, అందులో 271 సెంటర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని ఫెర్టిలిటీ సెంటర్లే ఎక్కువగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ఆ తర్వాత వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన సెంటర్ల వివరాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, త్వరలో చర్యలు తీసుకోనున్నారు. 

రిజిస్టర్ అయ్యేది ఒక డాక్టర్.. సెంటర్ లో ఉండేది మరో డాక్టర్

ఫెర్టిలిటీ సెంటర్ల రిజిస్ట్రేషన్ సమయంలో పేర్కొన్న డాక్టర్లు, సెంటర్లల్లో ట్రీట్​మెంట్​ చేస్తున్న డాక్టర్లు వేరే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చాలా సెంటర్లలో ఎక్కడా ధరల పట్టిక, డాక్టర్ల పేర్లను ప్రదర్శించడం లేదు. రేడియాలజిస్టు, ఎంబ్రియాలజిస్టు లేకుండానే, అర్హత లేని వ్యక్తులతో కొన్ని కేంద్రాలు నడుస్తున్నాయి. సెంటర్లకు వచ్చే దంపతుల వివరాలు ఆన్​లైన్​లో నమోదు చేయడం లేదు. కొన్ని సెంటర్లు అక్రమంగా లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్నాయి.

 అలాగే, రూల్స్ ప్రకారం ప్రతి స్కానింగ్ వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయాలి. కానీ చాలా సెంటర్లు అలా చేయడం లేదు. రికార్డుల్లో చూపిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషీన్లకు, అక్కడున్న సంఖ్యకు కూడా మ్యాచ్ కావడం లేదు. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ కేసుల విషయం బయట పడుతుందనే స్కానింగ్ వివరాలను ఆన్​లైన్​లో ఎంటర్ చేయడం లేదని అధికారులు అనుమానిస్తున్నారు.