క‌రోనా టెస్టింగ్ సెంటర్ ఆవరణలోనే మెడికల్ వేస్ట్

క‌రోనా టెస్టింగ్ సెంటర్ ఆవరణలోనే మెడికల్ వేస్ట్
  • ప్రజలకు శాపంగా మారిన ఆసుప‌త్రి సిబ్బంది నిర్లక్ష్యం

రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్ అర్బన్ హెల్త్ సెంటర్ లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌తీరోజూ హెల్త్ సెంటర్ లో వంద నుంచి రెండు వందల మందికి కరోనా టెస్టులు సిబ్బంది నిర్వహిస్తున్నారు . అయితే టెస్టులకు వాడే కిట్లు, స్వాప్ శాంపిళ్లు, గ్లౌసులను నిర్లక్ష్యంగా టెస్టింగ్ సెంటర్ ఆవరణలోనే కుప్పగా పోసి నిప్పంటిస్తున్నారు. టెస్టుల కోసం క్యూ లైన్లు కూడా అక్కడే ఏర్పాటు చేయ‌డంతో ఆసుప‌త్రికి వ‌స్తున్న పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మెడికల్ వేస్ట్ ను ఎక్కడ పడితే అక్కడే వేయకూడదన్న నిబంధన ఉన్నా… హాస్పిటల్ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైరస్ పాజిటివ్ వచ్చిన వారి స్వాప్, వారి టెస్టింగ్ కిట్లను కూడా అక్కడే వేస్తుండడంతో హాస్పిటల్ కు వచ్చే మిగితా వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఏర్పడుతోంది.

మరోవైపు హాస్పిటల్ ఆవరణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చెత్తా చెదారంతో నిండి కంపుకొడుతోంది. కరోనా సమయంలో హాస్పిటల్ కు వచ్చే జనానికి ఇక్కడ భ‌ద్ర‌త‌ లేకుండా పోయిందని జనం వాపోతున్నారు. లక్షణాలు ఉన్నవారికి, లేనివారికి ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నా…అధికారులు అలాంటి రూల్స్ ఏమీ పాటించకుండా.. అందరికీ ఒకే దగ్గర పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఇతర వైద్యశాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.