అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మరోసారి చారిత్రక కనిష్టాన్ని నమోదు చేసింది. గురువారం నాడు రూపాయి విలువ 90.4675 వద్దకు పడిపోయింది. డిసెంబర్ 4న నమోదైన 90.42 రికార్డును ఇది అధిగమించింది. ముఖ్యంగా కీలకమైన 90 మార్కును దాటి రూపాయి విలువ పతనం కావడం ఆర్థిక రంగంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
2025లో రూపాయి విలువ డాలర్‌పై 5% కంటే ఎక్కువ క్షీణించింది. 31 ప్రధాన కరెన్సీల్లో ఇది టర్కిష్ లిరా, అర్జెంటీనా పెసో తర్వాత మూడో అత్యంత బలహీనమైన కరెన్సీగా నిలిచింది. డాలర్ బలం 7% పైగా తగ్గినా రూపాయి పడిపోవడం మాత్రం కొనసాగుతూనే ఉండటం గమనార్హం. నిపుణులు కూడా ఈ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం భారీగా ఉండటం.. కంపెనీలు తమ చెల్లింపుల కోసం డాలర్లను భారీగా కొనుగోలు చేయడంతో పాటు విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణతో పెరిగిన డాలర్ డిమాండ్ వంటివి పతనానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. మరోపక్క అమెరికాతో ట్రేడ్ డీల్ ఆలస్యం.. 2026 మార్చి నాటికి అది పూర్తవచ్చనే వార్తలు కూడా రూపాయి విలువ పతనాన్ని డ్రైవ్ చేస్తున్న కారణాల్లో ఒకటిగా నిపుణులు అంటున్నారు.
Also read:- ప్లాన్ మార్చేసిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు..
రంగంలోకి ఆర్‌బీఐ..!
రూపాయి మరింత పతనం కాకుండా నిరోధించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. రూపాయి కన్వర్టిబిలిటీపై ఉన్న నియంత్రణల కారణంగా.. మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడటానికి గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆర్‌బీఐకి ఈ జోక్యం తప్పనిసరి. ఇందులో భాగంగా ఆర్‌బీఐ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయి విలువను కాపాడే ప్రయత్నం చేస్తోంది. అంతర్జాతీయంగా సింగపూర్, దుబాయ్, లండన్లలో పనిచేసే ప్రధాన బ్యాంకుల భాగస్వామ్యంతో 'నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్' వంటి డెరివేటివ్ కాంట్రాక్టుల ద్వారా ఆర్‌బీఐ దీనిని అమలు పరుస్తోంది. రూపాయి క్షీణత దిగుమతి చేసుకునే వస్తువుల ధరలను, విదేశీ రుణాలపై వడ్డీ చెల్లింపుల భారాన్ని పెంచుతుంది. అలాగే ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు అదనపు సవాళ్లను సృష్టిస్తుంది.

