నవంబర్ 2025లో భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ బలమైన వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా ఇన్వెస్టర్ల పెట్టుబడి వ్యూహాలు మారటంతో ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.29వేల 911 కోట్లకు చేరాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(AMFI) తాజా డేటా ప్రకారం వెల్లడైంది. అక్టోబర్ నెలలో నమోదైన రూ.24వేల 690 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 21.2 శాతం అధికం కావటం గమనార్హం. గత కొన్ని నెలలుగా కాస్త నెమ్మదించిన వృద్ధికి ఇది బ్రేక్ వేస్తూ.. ఇన్వెస్టర్లలో తిరిగి ఉత్సాహం పెరిగినట్లు ఇది స్పష్టం చేస్తోంది.
లార్జ్-క్యాప్ ఫండ్స్ అక్టోబర్ నెలలో రూ.972 కోట్ల పెట్టుబడులను చూడగా.. నవంబర్‌లో ఏకంగా 68.7 శాతం ఇన్‌ఫ్లోలు పెరిగి రూ.వెయ్యి640 కోట్లకు చేరాయి. ఇక లార్జ్ & మిడ్-క్యాప్ ఫండ్స్ కూడా 41.7 శాతం వృద్ధితో రూ.4వేల 503 కోట్ల పెట్టుబడులను నమోదు చేశాయి. ఇదే క్రమంలో మిడ్-క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4వేల487 కోట్లు (17.9 శాతం పెరుగుదల), స్మాల్-క్యాప్ ఫండ్స్ లోకి రూ.4వేల 407 కోట్లు (26.8 శాతం వృద్ధి) పెట్టుబడులుగా వచ్చాయి.
Also read:- మందు తాగి సైకిల్ తొక్కితే కార్ డ్రైవింగ్ లైసెన్స్ కట్..
అయితే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ELSS) రూ.570 కోట్లు, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ రూ.278 కోట్ల అమ్మకాలను నమోదు చేశాయి నవంబర్ మాసంలో. ఇదే క్రమంలో డెట్ ఫండ్స్ కూడా నిధుల ఉపసంహరణలను నమోదు చేయగా.. ఆ డబ్బును ఎక్కువగా ఈక్విటీల్లోకి మళ్లించారు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు. ఇదే క్రమంలో లిక్విడ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్ కూడా భారీగానే అమ్మకాలను చూశాయి నవంబరులో. మనీ మార్కెట్ ఫండ్స్, అల్ట్రా-షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ మాత్రం కొద్ది మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాయి.
Also read:- సరికొత్త రికార్డు కనిష్టానికి రూపాయి విలువ పతనం.. ఆందోళనలో భారత మార్కెట్స్
గోల్డ్ ఈటీఎఫ్స్ పరిస్థితి ఇలా..
కొన్ని నెలలుగా గోల్డ్ ఈటీఎఫ్‌లకు మంచి ఆదరణను చూస్తున్నాయి. అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల మధ్య భారతీయ పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌లువరుసగా ఏడవ నెలలో కూడా పెరిగిన పెట్టుబడి ప్రవాహాలను నమోదు చేశాయి. నవంబర్‌లో రూ.3వేల 742 కోట్లు వీటిలోకి వచ్చాయి. మొత్తంగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోని మొత్తం ఆస్తులు (AUM) రూ. 80.5 లక్షల కోట్లకు చేరగా.. ఇందులో ఈక్విటీల వాటా రూ. 35.66 లక్షల కోట్లకు పెరిగింది. నవంబర్ నెలలో సుమారు 24 కొత్త పథకాలు ప్రారంభమై రూ.3వేల 126 కోట్లను సమీకరించాయి.

