జపాన్‌లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, మద్యం తాగి సైకిళ్లు నడుపుతూ పట్టుబడిన దాదాపు 900 మంది సైక్లిస్టుల కార్ డ్రైవింగ్ లైసెన్స్ పోలీసులు రద్దు చేశారు. విషయం ఏంటంటే మద్యం తాగి సైకిల్ నడిపిన వ్యక్తులు కారు నడుపుతున్నప్పుడు కూడా ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది అని అధికారులు భావించి ఈ చర్య తీసుకున్నారు.
సైక్లిస్టులపై కఠిన జరిమానాలు విధించేల కొత్త ట్రాఫిక్ చట్టాలను జపాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు రద్దైన లైసెన్స్‌లు గత ఏడాదితో పోలిస్తే బాగా పెరిగాయి.
కొత్త నిబంధనలు ఏమిటి: గత సంవత్సరం నవంబరులో ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధనల ప్రకారం మద్యం సేవించి సైకిల్ తొక్కేవారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 500,000 యెన్లు అంటే సుమారు రూ.2.8 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.
తాగి సైకిల్ నడిపినందుకు శిక్ష విధించే ఆల్కహాల్ పరిమితిని కూడా తగ్గించారు. బ్రీత్ ఆల్కహాల్ టెస్ట్‌లో లీటరుకు 0.15 మిల్లీగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లు తేలితే సైక్లిస్టులకు జరిమానా విధిస్తారు. కానీ పాత నిబంధనల ప్రకారం, సైకిల్‌ను సరిగ్గా నడపలేకపోతే మాత్రమే శిక్ష పడేది, కానీ ఇప్పుడు ఆల్కహాల్ పరిమితిని బట్టి శిక్ష విధిస్తారు. అంతేకాదు మద్యం తాగినవారికి సైకిళ్లు ఇచ్చిన లేదా మద్యం ఇచ్చిన వారికీ కూడా జరిమానాలు వర్తించే అవకాశం ఉంది.
పోలీసుల లెక్కల ప్రకారం, నవంబర్ 2024 నుండి ఈ ఏడాది జూన్ వరకు జపాన్ దేశం అంతటా 4 వేల 500 మందికి పైగా ప్రజలు తాగి సైకిల్ తొక్కుతూ పట్టుబడ్డారు. ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ తాగి సైకిల్ తొక్కడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు జరగవచ్చు. తాగవద్దు, తాగి వాహనం నడపవద్దు అనే నియమాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని నేను కోరుకుంటున్నాను అని అన్నారు.
ALSO READ : ఇండిగో శుభవార్త..
ప్రమాదాలు పెరగడానికి కారణం: కరోనా మహమ్మారి సమయంలో సైకిల్స్ ప్రయాణ సాధనంగా బాగా ప్రాచుర్యం పొందాయి, కానీ వాటి వల్ల జరిగే ప్రమాదాలు కూడా పెరిగాయి. స్థానిక సమాచారం ప్రకారం 2023లో జపాన్‌లో 72 వేల కంటే పైగా సైకిల్ ప్రమాదాలు జరిగాయి. దీన్ని పోల్చి చూస్తే దేశంలో జరిగే మొత్తం ట్రాఫిక్ ప్రమాదాల కంటే 20% ఎక్కువ.
జపాన్‌లో మద్యం సాంప్రదాయకంగా ఒక సామాజిక అంశంగా, వ్యాపార చర్చల్లో ముఖ్య భాగంగా ఉంది. మద్యం సేవించడం వల్ల అలాంటి చర్చలకు మరింత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని నమ్ముతారు. అయితే సురక్షితమైన ప్రయాణం కోసం అధికారులు నిబంధనలను మరింత పెంచుతున్నారు. వచ్చే ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చే మరికొన్ని కొత్త నిబంధనల ప్రకారం గొడుగు పట్టుకుని సైకిల్ తొక్కడం, బైక్‌పై ఫోన్‌లు వాడటం, ట్రాఫిక్ సిగ్నల్ పాటించకపోవడం, రాత్రిపూట లైట్లు లేకుండా ప్రయాణించడం వంటి చిన్న చిన్న నేరాలకు కూడా సైక్లిస్టులపై జరిమానా విధించనుంది.

