V6 News

IndiGo Voucher: ఇండిగో శుభవార్త.. ఆ ప్రయాణికులకు ఫ్రీగా రూ.10వేల ట్రావెల్ ఓచర్..

IndiGo Voucher: ఇండిగో శుభవార్త.. ఆ ప్రయాణికులకు ఫ్రీగా రూ.10వేల ట్రావెల్ ఓచర్..

డిసెంబర్ నెల ప్రారంభ వారంలో ఇండిగో విమాన సేవల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొనసాగుతున్న సమస్య ఇప్పటికీ పూర్తి స్థాయిలో స్థిమిత పడలేదు. విమానాల రద్దులు ఇంకా అనేక నగరాలకు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు వారికి ట్రావెల్ గిఫ్ట్ ఓచర్ ఉచితంగా అందించాలని నిర్ణయించింది ఇండిగో. 

డిసెంబర్ 3 నుంచి 5 మధ్య విమాన టిక్కెట్లు బుక్ చేసుకుని ఇబ్బందులు ఎదుర్కొన్న కస్టమర్లకు రూ.10వేల ట్రావెల్ ఓచర్ ఉచితంగా అందించాలని ఇండిగో సంస్థ నిర్ణయించింది. ఆ సమయంలో విమానాలు రద్దు కావడంతో ప్రయాణంలో ఉన్న పెద్ద ఎత్తున విఘాతం కలిగింది. దీనికి 12 నెలల వ్యాలిడిటీ ఉంటుందని.. ఈ సమయంలో ఎప్పుడైనా తమ తర్వాత ప్రయాణ సమయంలో దీనిని రిడీమ్ చేసుకోవచ్చని ఇండిగో ఉచిత ఓచర్ గురించి వెల్లడించింది. అయితే ఇది ఫ్లైట్ టిక్కెట్ డబ్బు రీఫండ్ అలాగే ప్రభుత్వం నిర్థేశించిన రూ.5వేల నుంచి రూ.10వేలు పరిహారానికి అదనంగా ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 

డిసెంబర్‌లో జరిగిన ఈ సమస్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వేలాది విమానాలు రద్దులు, ఆలస్యాలతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడగా.. చాలా విమానాశ్రయాలు గందరగోళంగా మారాయి. ఈ సంక్షోభం దశలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను డీజీసీఏ  మంగళవారం సమన్లు పంపి.. ఘటనలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే రోజురోజుకూ పరిస్థితులు మెరుగుపడుతూ విమాన రద్దుల సంఖ్య తగ్గిస్తోంది ఇండిగో. రానున్న మరిన్ని రోజుల్లోనే పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటాయని హామీ ఇస్తోంది. ఇండిగో సేవలను పర్యవేక్షించేందుకు ఇప్పటికే 8 సభ్యుల బృందం కూడా ఏర్పాటు చేయబడిన సంగతి తెలిసిందే. ఇలాంటివి మళ్లీ జరగకుండా కేంద్ర ప్రభుత్వం డీజీసీఏ సమాలోచనతో చర్యలు చేపడుతున్నాయి.