V6 News

కొనసాగుతున్న IndiGo సంక్షోభం: 4 అధికారులను తొలగించిన DGCA.. CEOకి సమన్లు

 కొనసాగుతున్న IndiGo సంక్షోభం:  4 అధికారులను తొలగించిన DGCA.. CEOకి సమన్లు

ఇండిగో విమానాల రద్దు, ఆలస్యం కారణంగా ప్రయాణికుల ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఓ కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇండిగో కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు బాధ్యత వహించిన నలుగురు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లను (FOI) శుక్రవారం (డిసెంబర్ 12) తొలగించింది.

DGCA నుండి ఇండిగోకు ఆదేశాలు:
వచ్చే ఏడాదిలో దాదాపు 900 మంది పైలట్లను నియమించుకోవడానికి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని DGCA ఇండిగోను ఆదేశించింది. అలాగే  కొత్త 'ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్' (FDTL) నిబంధనలు ఫిబ్రవరి 2026 నాటికి పూర్తిగా అమలు చేయాలి. దీనికి అనుగుణంగా ఇండిగో  కార్యకలాపాలను స్థిరీకరించాల్సి ఉంది. నెట్‌వర్క్‌ను సాధారణ స్థితికి తీసుకురావడానికి, ఇండిగో విదేశీ ఎయిర్‌క్రూ (FATA) ఆమోదాలను వేగంగా పూర్తి చేస్తూ, కెప్టెన్‌లు, ఫస్ట్ ఆఫీసర్‌లను త్వరగా విధుల్లోకి తీసుకుంటోంది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, విమానాశ్రయాలు అలాగే  ఎయిర్‌లైన్స్ పనితీరును దగ్గరగా పర్యవేక్షించడానికి ఎనిమిది మంది DGCA అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం దేశవ్యాప్తంగా విమాన కార్యకలాపాలు, ప్రయాణీకుల సంక్షేమాన్ని ప్రతిరోజూ పరిశీలిస్తుంది.

 ఈ బృందంలోని ఇద్దరు అధికారులు ప్రతిరోజు ఇండిగో గురుగ్రామ్ కార్పొరేట్ ఆఫీస్‌లో ఉండి, విమానాల విస్తరణ, సిబ్బంది, శిక్షణ, సెలవులు వంటి అన్ని అంశాలను సమీక్షిస్తారు. విమానాల రద్దుపై ట్రాకింగ్, టికెట్ రిఫండ్, పరిహారం, లగేజ్ తిరిగి ఇవ్వడం వంటి ప్రయాణీకులకు సంబంధించిన సమస్యల కోసం ఇద్దరు ప్రత్యేక అధికారులు ఇండిగో ఆఫీసులో  నియమించనుంది. ఈ టీం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తారు.

ఇండిగో సీఈఓకు సమన్లు: ఈ సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు డిసెంబర్ 11 గురువారం రోజున హాజరు కావాలని DGCA సమన్లు జారీ చేసింది. ప్రస్తుత అంతరాయాలు, వాటిని పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలు అలాగే  నియామక ప్రణాళికల గురించి వివరణ ఇవ్వాలని ఆయనను కోరింది.