V6 News

Akhanda 2: అఖండ2 సినిమాకు ఊహించని షాక్.. తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

Akhanda 2: అఖండ2 సినిమాకు ఊహించని షాక్.. తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

హైదరాబాద్: అఖండ2 టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలైంది. టికెట్ ధరలను పెంచుతూ.. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ  న్యాయవాది శ్రీనివాస రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్కి న్యాయస్థానం అనుమతించడంతో ఈ పిటిషన్ విచారణకు రానుంది. టికెట్ల ధర పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై న్యాయస్థానం విచారణ చేయనుంది. మధ్యాహ్నం 2:25 గంటలకు హైకోర్టు ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే తెలంగాణలో ప్రీమియర్ షో బుకింగ్స్ కూడా ఓపెన్ అవడం, బాలయ్య అభిమానులు బుక్ చేసుకోవడం కూడా జరిగింది. డిసెంబర్ 12 మార్నింగ్ షో టికెట్లు మొదలుకుని అన్ని షోలకు బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఈ క్రమంలో.. అఖండ 2: తాండవం టికెట్ రేట్ల పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ విచారణకు రావడం ఆసక్తికర పరిణామం. డిసెంబర్ 12న దేశవ్యాప్తంగా విడుదలవుతున్న అఖండ2 సినిమా ప్రీమియర్స్ 11న రాత్రి 8:45 నుంచే పడనున్నాయి.

డిసెంబర్ 11న రాత్రి 9 గంటలకు ప్రదర్శించే ప్రీమియర్ షో ధర 600 రూపాయలకు అమ్ముకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 12 నుంచి 14 వరకు మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపు, సింగిల్ స్క్రీన్‌ థియేటర్లలో టికెట్‌పై రూ.50 పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ అనుమతినిచ్చింది. అఖండ2 సినిమా రిలీజ్ కష్టాలను దాటుకుని విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

►ALSO READ | OTT Thriller: ఓటీటీలోకి తెలుగు మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

14 రీల్స్ ప్లస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5నే విడుదల కావాల్సి ఉండగా.. Erosతో వివాదం.. ఫైనాన్స్ కష్టాలు ఎదురవడంతో విడుదల వాయిదా పడింది. ఈ వివాదాలను పరిష్కరించుకుని డిసెంబర్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. డిసెంబర్ 11న రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోతో అఖండ2 తాండవం మొదలవుతోంది. బోయపాటి, బాలకృష్ణ కాంబోలో వచ్చిన అఖండ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా అఖండ 2 సినిమా తెరకెక్కింది.