V6 News

OTT Thriller: ఓటీటీలోకి తెలుగు మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Thriller: ఓటీటీలోకి తెలుగు మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హీరో అల్లరి నరేశ్, పొలిమేర హీరోయిన్ కామాక్షి భాస్కర్ల కలయికలో వచ్చిన మూవీ ‘12ఏ రైల్వే కాలనీ’. నవంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీ సడన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ గురువారం (డిసెంబర్ 11) నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే, నెలరోజుల లోపే సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం!!

ఈ సినిమాకి నాని కాసరగడ్డ దర్శకత్వం వహించగా, పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాలకి పనిచేసిన రైటర్‌ కం డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ కథను అందించారు. అంతేకాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలు & షోరన్నర్గా అనిల్ వ్యవహరించారు. హీరో నరేష్ నుంచి ఫస్ట్ టైం హారర్ థ్రిల్లర్ జోనర్లో రావడంతో మంచి క్యూరియాసిటీ తీసుకొచ్చింది. కానీ, కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. 

కథేంటంటే:

కార్తిక్‌ (నరేశ్‌) ఓ అనాథ. వరంగల్‌లోని రైల్వే కాలనీలో తన స్నేహితులతో (హర్ష, గెటప్‌ శ్రీను, సద్దాం) కలిసి ఉంటాడు. వీరందరూ లోకల్ పొలిటిషన్ వరంగల్‌ టిల్లు (జీవన్‌ కుమార్‌) దగ్గర పని చేస్తుంటారు. కార్తిక్‌ వరంగల్‌ టిల్లుకి నమ్మిన బంటు. వరంగల్‌ టిల్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ.. వరుసగా రెండుసార్లు పరాజయం పాలవుతాడు. ఇక మూడో సారి ఎలాగైనా గెలవాలని టిల్లు కంకణం కట్టుకుంటాడు. ఈ క్రమంలో తన ప్రచార బాధ్యతలను కార్తిక్‌కి అప్పగిస్తాడు. ఇందులో భాగంగా కార్తీక్ నిర్వహించిన ఓ పోటీలో ఆరాధనను (కామాక్షి భాస్కర్ల)ను చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమని ఎన్ని విధాలుగా వ్యక్తపరిచిన, ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఆరాధన.

ALSO READ : ‘మత్తు వదలరా’ సినిమా డైరెక్టర్ రితేష్ రానా ‘జెట్లీ’ నుంచి హీరోయిన్‌‌‌‌ ఫస్ట్ లుక్‌‌‌‌ రిలీజ్

ఈ క్రమంలోనే కార్తీక్కి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వరంగల్‌ టిల్లు ఓ కవర్‌ ఇస్తాడు. అది ఓపెన్‌ చేయొద్దని.. ఎవరికి తెలియకుండా దాచాలని చెబుతాడు. దాంతో కార్తీక్ ఆ కవర్‌ని పట్టుకుని వెళ్తుండగా.. పోలీసుల రైడ్ జరుగుతుంది. ఇక చేసేదేం లేక రెండు, మూడు రోజులుగా తాళం వేసి ఉన్న ఆరాధన ఇంట్లో అది దాచాలని డిసైడ్ అవుతాడు కార్తీక్. అలా ఎవ్వరు లేని ఇంట్లోకి వెళ్లిన కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయి కళ్లు తిరిగి కిందపడతాడు. కట్‌ చేస్తే ఆసుపత్రిలో ఉంటాడు.  ఆరాధన మరియు ఆమె తల్లిని ఎవరో అతి క్రూరంగా హత్య చేస్తారు. అక్కడి కనిపించిన ప్రతి దృశ్యం వింతగా, అనుమానాస్పదంగా ఉంటుంది. ఈ కేసుని పోలీస్‌ ఆఫీసర్‌ రానా ప్రతాప్‌(సాయి కుమార్‌) ఇన్వెస్టిగేట్‌ చేస్తుంటాడు. ప్రైమ్ సస్పెక్ట్ కింద కార్తిక్‌నే పట్టుకుంటారు. రానా ప్రతాప్‌ సాయంతో ఎలాగో అలాగా కార్తిక్‌ బయట పడుతాడు.  

కానీ, అసలు ఆ హత్యలు చేసిందెవరు? ఆరాధన ఇంట్లో జరిగిన సంఘటనలు ఏమిటి? ఇంతకీ ఆరాధన ఎవరు? ముంబైలో ఉన్న డాక్టర్‌ షిండే(అనీష్‌ కురువిల్లా)కి ఆరాధనకు ఉన్న రిలేషన్ ఏంటి? చనిపోయిన ఆరాధన.. కేవలం కార్తిక్‌కి మాత్రమే ఎందుకు కనిపించింది? టిల్లు అన్న కార్తీక్కి ఇచ్చిన పార్సిల్లో ఏముంది? ఈ మర్డర్‌ మిస్టరీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రానా ప్రతాప్ (సాయి కుమార్) ఎలా ఛేదించాడు? అనేది తెలియాలంటే 12A రైల్వే కాలనీ చూడాల్సిందే.