V6 News

సర్పంచ్ ఎన్నికల్లో రికార్డు బ్రేకింగ్ వార్త.. ఈ ఊళ్లో ఒక్క ఓటుకు రూ. 20 వేలు ?

సర్పంచ్ ఎన్నికల్లో రికార్డు బ్రేకింగ్ వార్త.. ఈ ఊళ్లో ఒక్క ఓటుకు రూ. 20 వేలు ?

రంగారెడ్డి: తెలంగాణ పంచాయతీ ఎన్నికలో శంషాబాద్ మండలం పరిధిలోని నర్కూడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో రికార్డు బ్రేకింగ్ చేసే వార్త ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటుకు ఏకంగా రూ.15 వేల నుంచి 20 వేల వరకు పంచుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

గ్రామంలో మొత్తం 4 వేలకు పైగా ఓట్లు ఉండటం.. పోటీ ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు పోటీ పడి మరీ డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. సర్పంచ్ ఎన్నికల కోసం ఏకంగా ఓటుకు రూ.20 వేలు పంపిణీ చేయడం చర్చనీయంశమైంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదని స్థానికంగా చర్చ నడుస్తోంది.

అదేంటంటే.. నర్కూడ గ్రామం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉండటం, నర్కూడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువగా సాగుతుండటంతో గ్రామానికి పెద్ద మొత్తంలో ఆదాయ వనరులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఎంత ఖర్చుపెట్టిన తిరిగి వస్తుందనే నమ్మకంతోనే ఎంతయిన ఖర్చుపెట్టడానికి అభ్యర్థులు వెనుకాడటం లేదు. 

కాగా సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ ఓటుకు పలుకుతున్న ధరనే రాష్ట్రవ్యా్ప్తంగా అత్యధికం కావడం విశేషం. గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఓటుకు రూ.15 వేల 20 వేల వరకు పలికినట్లు ప్రచారం సాగింది. అయితే ఒక సర్పంచ్ ఎన్నికకు ఇంత పలకడం రాష్ట్ర ఎన్నికల చరిత్రలో రికార్డు బ్రేకింగ్ వార్తగా అందరూ చెప్పుకుంటున్నారు.