V6 News

IND vs SA: మీకో దండం.. టీ20కి రిటైర్మెంట్ ఇచ్చేయండి: కెప్టెన్, వైస్ కెప్టెన్‌లపై నెటిజన్స్ ఫైర్

IND vs SA: మీకో దండం.. టీ20కి రిటైర్మెంట్ ఇచ్చేయండి: కెప్టెన్, వైస్ కెప్టెన్‌లపై నెటిజన్స్ ఫైర్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ చెత్త ఫామ్ కొనసాగుతోంది. ఈ ఏడాది ఘోరంగా ఆడిన వీరిద్దరూ ఇంకా గాడిలో పడలేదు. మ్యాచ్ మ్యాచ్ కు నిరాశపరుస్తున్నారు గానీ ఒక్క మ్యాచ్ లోనూ బ్యాట్ ఝుళిపించడంలో విఫలమవుతున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లోనూ ఇద్దరూ సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. గురువారం (డిసెంబర్ 11) చండీగఢ్ వేదికగా ముల్లన్‌పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో గిల్ తొలి బంతికి డకౌట్ అయితే సూర్య 5 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. 

సౌతాఫ్రికా విధించిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో గిల్ ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. టీ20 వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న శుభ్‌‌‌‌‌‌‌‌మన్ ఫామ్ ఇండియాను కలవరపెడుతోంది. ఆసియా కప్ నుంచి గమనిస్తే గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. కాన్‌‌‌‌‌‌‌‌బెరాలో తొలి టీ20లో మాత్రమే కెప్టెన్ సూర్యతో కలిసి కాస్త మెప్పించాడు. ఆ తర్వాత నాలుగో వన్డేలో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 4 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. అడపాదడపా ఇన్నింగ్స్ లు తప్పితే గిల్ పెద్దగా రాణించడం లేదు.

గిల్ చివరి 14 ఇన్నింగ్స్ లు చూసుకుంటే 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1) ఇలా ఉన్నాయి. కేవలం 3 సార్లు మాత్రమే 30 పరుగుల మార్క్ అందుకున్నాడు. దీంతో గిల్ స్థానంలో శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. శాంసన్ ఓపెనర్ గా అర్హుడని.. ఫామ్ లో లేని గిల్ ని జట్టులో కొనసాగించడం అనవసరం అని భావిస్తున్నారు. 

సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. జట్టు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడితే సూర్య ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. జట్టు వరుస విజయాలు సాధిస్తుండటంతో పెద్దగా విమర్శలు రావడం లేదు. కానీ వ్యక్తిగతంగా సూర్య బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. 2025లో సూర్య టీ20 గణాంకాలు ఘోరంగా ఉన్నాయి. ఆడిన 16 ఇన్నింగ్స్ ల్లో ఒక్క మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు. వీటిలో మూడు డకౌట్ లు ఉన్నాయి. నాలుగు సార్లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు.

యావరేజ్ కేవలం 15 మాత్రమే ఉంది. కెప్టెన్ గా విజయాలు సాధిస్తున్నా.. బ్యాటింగ్ లో నిరాశపరుస్తున్నాడు. దీంతో నెటిజన్స్ సూర్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సూర్య, గిల్ జట్టులో ఉండడానికి అర్హత లేదని నెటిజన్స్ ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించాలని ఫైరవుతున్నారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా ప్రస్తుతం 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.