V6 News

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 'ఫైనలిస్ట్ రేస్'లో హై టెన్షన్.. భరణికి తనూజ షాక్.. డీమాన్ ఔట్‍తో ఊహించని ట్విస్ట్!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 'ఫైనలిస్ట్ రేస్'లో హై టెన్షన్.. భరణికి తనూజ షాక్.. డీమాన్  ఔట్‍తో ఊహించని ట్విస్ట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకోవడంతో షో మరింత ఉత్కంఠతను రేపుతోంది.  హౌస్ లో సెకండ్ ఫైనలిస్ట్‌ను నిర్ణయించే రేసు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. 95వ రోజు జరిగిన ఈ పోటీలో నాటకీయ పరిణామాలు, పాయింట్ల మార్పిడితో లీడర్ బోర్డు ఒక్కసారిగా తారుమారైంది. ఇప్పటికే సుమన్ శెట్టి ఈ రేసు నుంచి ఔట్ కాగా.. లేటెస్ట్ గా డీమాన్ పవన్ కూడా తప్పుకున్నాడు. దీంతో సెకండ్ ఫైనలిస్ట్ బెర్త్ కోసం తనూజ, భరణి, ఇమ్మానుయేల్, సంజన మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

డీమాన్ ఔట్.. ఫస్ట్ ప్లేస్‌లోకి తనూజ..

లీడర్ బోర్డులో అందరికంటే తక్కువ స్కోరు ఉన్న కారణంగా డీమాన్ పవన్ ఫైనలిస్ట్ రేసు నుంచి తప్పుకోవాలని బిగ్ బాస్ ఆదేశించాడు. అయితే, అతను సంపాదించిన స్కోరులో సగం పాయింట్లను ఇంటిసభ్యుల్లో ఒకరికి ఇచ్చే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని డీమాన్ పవన్, తన తర్వాత స్థానంలో ఉన్న తనూజకు తన పాయింట్లను ఇచ్చాడు. ఈ అనూహ్య మలుపుతో, నాలుగవ స్థానంలో ఉన్న తనూజ ఒక్కసారిగా 295 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. ఆమె తర్వాత స్థానంలో లీడర్ బోర్డు ప్రకారం సంజన 290 పాయింట్లు, ఇమ్మానుయేల్ 270,  భరణి 230 పాయింట్లతో ఉన్నారు. 

భరణికి బిగ్ షాక్ ఇచ్చిన తనూజ..

లీడర్ బోర్డులో మార్పు జరిగిన వెంటనే, బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. తదుపరి యుద్ధంలో పాల్గొనకుండా ఇంటి సభ్యులందరూ కలిసి ఒక సభ్యుడిని తొలగించాలి. ఇది ఫైనలిస్ట్ రేసులో ఇంకో ముఖ్యమైన ఘట్టం అని చెప్పారు. దీంతో తక్కువ పాయింట్లతో ఉన్న భరణి, తనూజ వద్దకు వెళ్లి మాట్లాడటానికి ప్రయత్నించాడు. నువ్వు ఎవరిని తొలగించాలని అనుకుంటున్నావు అని భరణి అడగగా.. తనూజ ఏమాత్రం దాపరికాలు లేకుండా ఓపెన్‌గా తన అభిప్రాయం చెప్పింది. "నేను ఇమ్మానుయేల్‌ని తప్పించాలని అనుకోవడం లేదు. నా దృష్టిలో అయితే, ఒకరు మీరు, రెండు సంజన గారు అని చెప్పింది.

నా కన్నా ఇమ్మూ ఎక్కువా?

ఈ మాటతో భరణి ఒక్కసారిగాషాక్ అయ్యాడు.  నా కన్నా ఎందుకు ఇమ్మానుయేల్ ప్రయారిటీ అంటున్నావ్?" అని భరణి నిలదీశారు. దానికి తనూజ బదులిస్తూ.. ఈ మధ్య కాలంలో నాకు ఎక్కువగా స్టాండ్ తీసుకుంది వాడే కదా.. అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఈ సమాధానంతో తీవ్రంగా హర్టైన భరణి సైలెంట్‌గా ఉండిపోయాడు. తర్వాత సంజన, సుమన్ శెట్టి దగ్గర తన బాధను వెళ్లగక్కాడు. నాకు హెల్ప్ చేస్తుందా చేయదా అన్నది పక్కన పెట్టు. కానీ, ఇమ్మానుయేల్ నా గురించి స్టాండ్ తీసుకున్నాడని చెప్పిన మాట నాకు చాలా బాధేస్తుంది. మరి నేనేం చేశాను అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

బిగ్ బాస్ తుది అంకానికి చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య స్నేహాలు, శత్రుత్వాలు ఫైనలిస్ట్ రేసులో ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో స్పష్టమవుతోంది .  భరణి - తనూజ మధ్య జరిగిన ఈ వాగ్వాదం ఈ రోజు ఎపిసోడ్‌లో ప్రధాన హైలైట్‌గా నిలిచింది. తదుపరి తొలగింపు ఎవరికి జరుగుతుందో ఈ రోజు ఎపిసోడ్ లో తేలనుంది.