
ఎన్ని లోన్లు తీసుకున్నరు.. డిజైన్లు ఎవరు మార్చారు?
మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై ఆఫీసర్లకు విజిలెన్స్ ప్రశ్నలు
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం ఎన్ని లోన్లను తీసుకున్నారని, ఆ బ్యారేజీ డిజైన్లను ఎవరు మార్చారని అధికారులను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రశ్నించింది. మంగళవారం వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మ, సీడీవో (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్) మాజీ సీఈ టి.శ్రీనివాస్ ను విజిలెన్స్ ప్రశ్నించింది. మేడిగడ్డ బ్యారేజీకి ముందు సూచించిన డిజైన్లను కాకుండా కొత్త డిజైన్లను సూచించిందెవరని అడిగినట్టు తెలిసింది. ‘‘మార్పు చేసిన డిజైన్లకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అనుమతులు లభించాయా? వ్యాప్కోస్ సమర్పించిన డీపీఆర్‌లో ఉన్నట్టు కాకుండా కొత్తగా డిజైన్లను చేయాలని చెప్పిందెవరు? చేసిన టెస్టులకు తగ్గట్టు డిజైన్లను రూపొందించారా?’’ అని విజిలెన్స్ ప్రశ్నించినట్టు సమాచారం. షీట్‌పైల్స్‌కు బదులు సీకెంట్ పైల్స్ డిజైన్‌ను ఎందుకు చేసినట్టు అని అధికారులను ప్రశ్నించినట్టు సమాచారం. బ్యారేజీ కోసం ఇప్పటిదాకా ఎన్ని చెల్లింపులు చేశారని కూడా అధికారులను విజిలెన్స్ అడిగినట్టు తెలిసింది. కాళేశ్వరం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందెవరు? దాని ద్వారా ఎన్ని రుణాలను సమీకరించారు? కాంట్రక్టర్లకు ఎంత చెల్లింపులు చేశారు? కాళేశ్వరం కార్పొరేషన్‌కు రెవెన్యూ వస్తున్నదా?’’ అని ప్రశ్నించినట్టు సమాచారం.