- ప్రతాపసింగారంలో దొంగల ముఠా అరెస్టు
మేడిపల్లి, వెలుగు: అద్దె ఇండ్లలో ఉంటూ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాపసింగారంలోని తేజశ్రీ హోమ్స్, మంజుశ్రీ మిడోస్ కాలనీల్లో పలువురు అద్దెకు నివసిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో శనివారం రాత్రి ఆ ప్రాంతంలో పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు.
పోలీసులు అక్కడికి చేరుకునే సరికి కొందరు దొంగలు పారిపోయారు. మహిళా దొంగలను, చిన్నారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సుమారు 70 సెల్‌ఫోన్లు, కిలోల కొద్దీ బంగారం, కారు, బుల్లెట్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అద్దె ఇంట్లో ఉంటూ చోరీలకు పాల్పడుతున్న విషయం తెలియగానే స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
కేపీహెచ్బీలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు..
కూకట్‌పల్లి: వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మిద్నాపూర్ జిల్లా మనిపూర్ గ్రామానికి చెందిన షేక్ జంషీద్ అలియాస్ జమ్మీ(44) నగరంలోని కింగ్‌కోఠి ప్రాంతంలో హోటల్ కార్మికుడిగా పనిచేస్తూ నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. 54 చోరీ కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఎట్టకేలకు జమ్మీని ఆదివారం కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. 8 మొబైల్ ఫోన్లు, ఒక స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు.

