ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ :మీనాక్షి నటరాజన్

ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ :మీనాక్షి నటరాజన్
  • ప్రతి గ్రామంలో కనీసం 100 సంతకాలు సేకరించాలి:మీనాక్షి నటరాజన్
  • పీసీసీ చీఫ్​తో కలిసి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జూమ్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: సామాజిక న్యాయం కోసం, ఓట్ చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాహుల్​గాంధీ చేస్తున్న పోరాటానికి పార్టీలోని ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. ఓట్ చోరీకి వ్యతిరేక పోరాటానికి మద్దతుగా ప్రతి గ్రామంలో కనీసం 100 సంతకాలు సేకరించాలని సూచించారు. శనివారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  పార్టీ నేతలతో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  జూమ్ మీటింగ్ నిర్వహించారు. 

ఈ సమావేశంలో మీనాక్షి మాట్లాడుతూ.. ఓట్ చోరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ నుంచి నాయకులు మొదలు కార్యకర్తల దాకా ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. “ తెలంగాణలో వరదల కారణంగా ఈ కార్యక్రమం కొంత ఆలస్యమైంది.. ఓట్​ చోరీకి వ్యతిరేకంగా చేపడ్తున్న సంతకాల సేకరణను ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నేతలంతా  ప్రత్యేక శ్రద్ధతో విజయవంతం చేయాలి. నాయకులు ఆయా బూత్ ల పరిధిలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టాలి. ప్రతి గ్రామంలో కనీసం వందకు తక్కువ కాకుండా సంతకాలు సేకరించి,  ఈ నెల  15 కల్లా ఏఐసీసీకి పంపాలి ”అని మీనాక్షి  ఆదేశించారు.