మీ సేవ కేంద్రాలు.. డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌‌‌‌‌‌‌‌లు .. మెటా సహకారంతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ప్రచారం

మీ సేవ కేంద్రాలు.. డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌‌‌‌‌‌‌‌లు .. మెటా సహకారంతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ప్రచారం
  • ఇప్పటికే విలేజ్ లెవల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ ప్రెన్యూర్లకు శిక్షణ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (మీ సేవ) పరిధిలోని కేంద్రాలను పౌర సేవలకే పరిమితం చేయకుండా డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్ లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 'మెటా' సహకారంతో చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ప్రచారం చేయాలని నిర్ణయించింది. నాణ్యమైన ప్రకటనల సేవలను అతి తక్కువ వ్యయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. 

వీఏల్ఈ లకు ట్రైనింగ్

క్యూర్ ప్రాంతానికి చెందిన 150 మందికి పైగా మీ సేవ విలేజ్ లెవల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్లు (వీఎల్​ఈ) ఇటీవల హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కేంద్రాల నిర్వాహకులకు మెటా వేదికలైన ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్, వాట్సాప్ లలో వ్యాపార ప్రకటనలను అత్యంత వృత్తిపరంగా రూపొందించడంపై పూర్తి స్థాయి శిక్షణ  ఇచ్చారు. 

వాట్సాప్ బిజినెస్ ఖాతాల క్రియేషన్, ఉత్పత్తుల ప్రచారం, సరైన వినియోగదారులను గుర్తించడం, లక్ష్యంతో కూడిన డిజిటల్ ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని సామాన్యులకు, వ్యాపారులకు చేరువ చేస్తోందని మీ సేవ కమిషనర్ టి. రవికిరణ్ వెల్లడించారు. ప్రపంచస్థాయి డిజిటల్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను రాష్ట్రంలోని మూలమూలలా ఉన్న మీ సేవా వ్యవస్థతో అనుసంధానించడంతో ఇప్పటివరకు డిజిటల్ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న చిన్న వ్యాపారాలకు సరికొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

స్థానిక వ్యాపారాలకు ఆసరా

వినూత్న డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని వివిధ రకాల వ్యాపారాలకు విస్తృత ప్రచారం లభించనుంది. వీధి చివర ఉండే కిరాణ షాపులు, పండ్ల వ్యాపారులు, స్వీట్ షాపులు, రెస్టారెంట్లు, మెడికల్ షాపులతో పాటు హాస్పిటల్స్, పాఠశాలలు, సెలూన్లు, మెకానిక్ షాపులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈలు ఇతర చిన్న, పెద్ద సంస్థలు ఇకపై తమ  సమీపంలోని మీ సేవా కేంద్రాన్ని సంప్రదించి బ్రాండింగ్ చేసుకోవచ్చు. 

వ్యాపారులు తమ ఉత్పత్తులకు సంబంధించిన వివరాలను అందజేస్తే, మీ సేవా నిర్వాహకులే స్వయంగా ప్రకటనల రూపకల్పన, ఆకర్షణీయమైన కంటెంట్ తయారీ, సరైన వినియోగదారుల ఎంపిక మరియు అడ్వర్టైజ్‌‌‌‌‌‌‌‌మెంట్ల ప్రచురణ తదితర సాంకేతిక ప్రక్రియలన్నింటినీ పూర్తి చేసి సహాయ సహకారాలు అందిస్తారు. 

దీంతో వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను అతి తక్కువ ఖర్చుతో వేలాది మంది స్థానిక వినియోగదారులకు చేరవేసి, వ్యాపారాభివృద్ధి సాధించేందుకు వీలు కలుగుతుంది. మరోవైపు, ఈ విధానం వల్ల కేవలం పౌర పత్రాల జారీకే పరిమితమైన మీ సేవా కేంద్రాలను నడిపే విలేజ్ లెవల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్లకు  అదనపు ఉపాధి, నిలకడైన ఆదాయమార్గాలు సమకూరనున్నాయి.