జడ్పీటీసీ, ఎంపీటీసీల సమస్యలపై సీఎంను కలుస్తం

జడ్పీటీసీ, ఎంపీటీసీల సమస్యలపై సీఎంను కలుస్తం

లోకల్ బాడీ ఎమ్మెల్సీల వెల్లడి
నిధులు, విధులపై మంత్రి ఎర్రబెల్లితో భేటీ

హైదరాబాద్, వెలుగు: జడ్పీటీసీలు, ఎంపీటీసీల సమస్యలు, నిధులు, విధులపై త్వరలో సీఎం కేసీఆర్ ను కలవనున్నట్లు లోకల్ బాడీ ఎమ్మెల్సీలు తెలిపారు. సమస్యలపై సీఎంకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆదివారం ఇదే విషయమై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో సమావేశమయ్యారు. ఎర్రబెల్లిని కలిసిన ఎమ్మెల్సీల్లో పట్నం మహేందర్ రెడ్డి, భానుప్రసాద్ రావు, నారదాసు లక్ష్మణ్ రావు, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సతీశ్ కుమార్, తేరా చిన్నప రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, శంభీపూర్ రాజు, బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారు.

ఇప్పటికైనా మేల్కొన్నరు

ఎంతో పోరాటం చేసిన తర్వాత ఎంపీటీసీలు, జడ్పీటీసీల సమస్యలపై లోకల్ బాడీ ఎమ్మెల్సీలు స్పందించారని పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, జడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బెల్లం శ్రీను ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కొన్నేళ్లుగా లోకల్ బాడీ ప్రజా ప్రతినిధుల గురించి పోరాడుతున్నామని చెప్పారు. 16 నెలల నుంచి తెలంగాణ పంచాయితీ రాజ్ చాంబర్, తెలంగాణ ఎంపీటీసీల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఎంపీటీసీల చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, వారి సమస్యలపై ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంత్సరంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు.