నేడు ఢిల్లీలో తిరుగుబాటు శివసేన ఎంపీల సమావేశం

 నేడు ఢిల్లీలో తిరుగుబాటు శివసేన ఎంపీల సమావేశం

మహారాష్ట్ర అసెంబ్లీ లో శివసేన చీలిన పరిస్థితులే పార్లమెంటరీ పార్టీలోనూ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లోక్ సభలో దాద్రా, నగర్ హవేలీ ఎంపీతో కలిపి శివసేనకు 19 మంది ఎంపీలు ఉన్నారు. కాగా.. ఇవాళ 12 మంది స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమను ప్రత్యేక గ్రూప్ గా గుర్తించాలని లేఖ అందజేయనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే నిర్వహించిన ఆన్ లైన్ సమావేశానికి హాజరై ఎంపీ రాహుల్ షెవాలెను లోక్ సభలో తమ నేతగా ఎన్నుకున్నామని షిండే వర్గం ఎంపీ తెలిపారు. మరోవైపు తమ దగ్గర 18 మంది ఎంపీలు ఉన్నారని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తెలిపారు .

ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీలు సంజయ్ రౌత్ నివాసంలో కలుసుకున్నారు. వీరిలో అర్వింద్ సావంత్,  వినాయక్ రౌత్, ఒమ్రాజె నింబాల్కర్, సంజయ్ జాదవ్, ప్రియాంకా చతుర్వేది, రాజన్ వికారే ఉన్నారు. లోక్ సభ ఎంపీ గజానన్ కీర్తికర్ అనారోగ్యం వల్ల భేటీకి రాలేకపోయారని తెలిపారు సంజయ్ రౌత్. చీలిక వర్గంలో 14 మంది ఎంపీలున్నారన్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు సంజయ్ రౌత్. మరోవైపు వినాయక్ రౌత్ నేతృత్వంలో ఠాక్రే వర్గం ఎంపీలు సోమవారం సాయంత్రం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. శివసేన పార్లమెంటరీ పార్టీ నేతగా వినాయక్ రౌత్, చీఫ్ విప్ గా రాజన్ వికారే నియమితులయ్యారని తెలిపారు. ఈ విషయంలో షిండే వర్గం చేసే వినతులు, జారీ చేసే విప్ లు పట్టించుకోవద్దని కోరారు.