హన్మకొండ జిల్లాలో మెగా జాబ్ మేళా ప్రారంభం

హన్మకొండ జిల్లాలో మెగా జాబ్ మేళా ప్రారంభం

హన్మకొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. పబ్లిక్ గార్డెన్స్ లోని నేరెళ్ళ వేణు మాధవ్ కళాప్రాంగణంలో DRDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ మేగా జాబ్ మేళాలో 30కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రైవేటు కంపెనీలు ఇస్తున్న ఉద్యోగ అవకాశాలను కూడా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ‘వరంగల్ బిడ్డలు ఎలాంటి శ్రమకైనా వెనుకాడరు..నిజాయితీగా పని చేస్తారు..ముక్కుసూటిగా మాట్లాడుతారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఎవరికైనా ఒకేసారి గుర్తింపు రాదని, వృత్తి నైపుణ్యాన్నీ బట్టి జీతాలు పెరుగుతాయని చెప్పారు. అధిక జీతాల కోసం అత్యాశ పడి..వచ్చిన అవకాశాలను ఎవరూ వదులుకోవద్దన్నారు. మూడేళ్ల క్రితం తొర్రూరులో జాబ్ మేళా నిర్వహిస్తే..  1500 మంది ఎంపిక అయితే.. 1000 మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరారని అన్నారు. గతంలో ఉద్యోగాల్లో చేరిన వారిలో చాలా మంది ఇప్పుడు తమ స్కిల్స్ తో లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తామని చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆనందంగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గతంలో 5 ఎకరాల భూమి ఉన్నా నగరాల్లో ఉద్యోగాల కోసం వెళ్లేవారని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు, సాగునీరు, 24 గంటల పాటు విద్యుత్ అందిస్తుండడం వల్ల వేల రూపాయల జీతాలు వదులుకుని.. చాలామంది వ్యవసాయం వైపు తిరిగి వస్తున్నారని అన్నారు. మెగా జాబ్ మేళా కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ఘన విజయం

లగ్జరీ కార్లకు పెరుగుతున్న ఆర్డర్లు