టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ యుద్ధం మొదలైంది. ఒకవైపు అద్దె విధానానికి స్వస్తి పలికి 'పర్సంటేజ్ షేరింగ్' మోడల్ తేవాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ సినీ ఎగ్జిబిటర్లు, తాజాగా స్టార్ హీరోల సినిమాలకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ప్రతినిధి శిరీష్ రెడ్డి ప్రెస్ మీట్‌లో చేసిన ఒక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
టికెట్ రేట్లు పెంచేదే లేదు!
ప్రభుత్వం జీవోల ద్వారా అనుమతి ఇచ్చినప్పటికీ, ఇకపై పెంచిన టికెట్ ధరలతో సినిమాలను ప్రదర్శించకూడదని ఎగ్జిబిటర్లు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. సామాన్య ప్రేక్షకుడిని థియేటర్లకు దూరం చేసే ఈ టికెట్ రేట్ల పెంపు విధానానికి ఇక చెక్ పెట్టాలని వారు భావిస్తున్నారు. నిర్మాతలకు లాభాలు తెచ్చే 'మన శంకర వరప్రసాద్ గారు', 'పుష్ప 2' లాంటి భారీ చిత్రాల కలెక్షన్లను ఉదాహరణగా చూపిస్తూ.. పాత రెంట్ల పద్ధతి వల్ల థియేటర్లు ఎలా నష్టపోతున్నాయో ఎగ్జిబిటర్లు వివరించారు.
రామ్ చరణ్ ‘పెద్ది’ కి భారీ ఎదురుదెబ్బ?
ఎగ్జిబిటర్ల ఈ సంచలన నిర్ణయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) పై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. ఈ సినిమా రిలీజ్‌కు నెల రోజులు కూడా సమయం లేదు. నైజాం ఏరియాలో ‘పెద్ది’ డిస్ట్రిబ్యూషన్‌ను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది. అయితే, మైత్రీ సంస్థ మొదటి నుంచీ ఈ పర్సంటేజ్ షేరింగ్ సిస్టమ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4, 2026న విడుదల కానుంది. రిలీజ్ నాటికి ఎగ్జిబిటర్లు డిమాండ్లకు పరిష్కారం లభించకపోతే 'పెద్ది' సినిమాపై ప్రభావంపడే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మేకర్స్‌కు భారీ నష్టం తప్పదా?
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘పెద్ది’ లాంటి పాన్ ఇండియా సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేకపోతే మేకర్స్‌కు భారీ నష్టం తప్పదు. అటు మైత్రీ మూవీ మేకర్స్ పట్టువీడడం లేదు, ఇటు ఎగ్జిబిటర్లు తగ్గేదేలే అంటున్నారు. మరి ఈ ఇగో వార్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’ సాధారణ టికెట్ ధరలతోనే వస్తుందా? లేక నిర్మాతలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారా? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బాక్సాఫీస్ క్రైసిస్ ఎటు దారితీస్తుందో చూడాలి.
