యూరప్‌‌‌‌ నిప్పుల కొలిమి..ఎండలకు కరిగిపోతున్న డాంబర్ రోడ్లు.. కాంక్రీట్‌‌‌‌ స్లాబ్‌‌‌‌లకు పగుళ్లు

యూరప్‌‌‌‌ నిప్పుల కొలిమి..ఎండలకు కరిగిపోతున్న డాంబర్ రోడ్లు.. కాంక్రీట్‌‌‌‌ స్లాబ్‌‌‌‌లకు పగుళ్లు
  • రికార్డులను బద్ధలు కొడుతున్న భానుడు
  • కరిగిపోతున్న డాంబర్​ రోడ్లు.. కాంక్రీట్‌‌‌‌ స్లాబ్‌‌‌‌లకు పగుళ్లు
  • దెబ్బతిన్న రైల్వే పట్టాలు.. ప్రజారవాణాకు ఆటంకం
  • నాలుగు రోజుల్లో వడగాడ్పులకు 1,300 మంది మృతి
  • అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40-–45 డిగ్రీలు
  • 850 నగరాల్లో సుమారు 45 శాతం ఆల్-టైమ్ ‘హీట్ స్ట్రెస్’
  • మానవ తప్పిదాలే కారణమని తేల్చిన శాస్త్రవేత్తలు
  • ఇంధన వాడకాన్ని తగ్గించడమే పరిష్కారమని సూచన


బెర్లిన్‌‌‌‌: యూరప్‌‌‌‌ నిప్పుల కొలిమిగా మారింది. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన, సుదీర్ఘమైన హీట్‌‌‌‌వేవ్ (వడగాల్పులు) కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నది. కార్బన్ కాలుష్యం కారణంగా మరింత కోరలు చాచిన ఈ వేడి.. ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నది. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడి పగలు, రాత్రిని నమోదు చేయగా.. బ్రిటన్, స్విట్జర్లాండ్‌‌‌‌ దేశాలు జూన్ నెలలో ఆల్-టైమ్ రికార్డ్ ఉష్ణోగ్రతలను బద్ధలు కొట్టాయి. ఎండ వేడికి పలుచోట్ల కాంక్రీట్‌‌‌‌ స్లాబ్‌‌‌‌లు పగుళ్లు పడుతున్నాయి. రైల్వే పట్టాలు దెబ్బతినడం.. రోడ్లు పగిలిపోవడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఎండల కారణంగా 1,300 మంది మృత్యువాత పడ్డట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌‌‌వో) వెల్లడించింది. అయితే, దీనికి మానవ తప్పిదాలే అసలు కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. మానవ చర్యలతో కలిగిన వాతావరణ మార్పులతోనే యూరప్‌‌‌‌ ఖండం గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కుతున్నదని గుర్తించారు. ఈ హీట్‌‌‌‌ వేవ్స్‌‌‌‌ వాతావరణంలో సంభవిస్తున్న ఒక ప్రమాదకరమైన మార్పునకు సంకేతమని పేర్కొంటున్నారు. 

శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకంతోనే వాతావరణంలో వేగంగా మార్పులు సంభవిస్తున్నట్టు తేల్చి చెప్పారు. ప్రస్తుతం యూరప్‌‌‌‌ వ్యాప్తంగా నమోదవుతున్న విపరీతమైన ఉష్ణోగ్రతలు.. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన జూన్ నెల వడగాల్పులుగా రికార్డు సృష్టించాయి. 5 దశాబ్దాల క్రితం  ఇలాంటి భీకర పరిస్థితులు తలెత్తడం అసాధ్యం  అని ‘వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్’ శాస్త్రవేత్తల బృందం ఓ నివేదికలో స్పష్టం చేసింది.

భానుడి భగభగ.. అల్లాడిపోతున్న దేశాలు..

యూరప్‌‌‌‌ గ్లోబల్ వార్మింగ్ కోరల్లో చిక్కుకున్నది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఖండాన్ని అతలాకుతలం చేస్తున్న భీకర ‘హీట్‌‌‌‌వేవ్’ (తీవ్ర వడగాలులు) అక్కడి జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. సూర్యుడు నిప్పుల కొలిమిలా మారుతుండటంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి తీవ్రతకు ఏకంగా రైల్వే పట్టాలు దెబ్బతినడం, రోడ్లు కరిగిపోతుండటం చూస్తుంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలు దేశాల్లో భానుడి భగభగలు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్‌‌‌‌ను దాటేయడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పశ్చిమ యూరప్‌‌‌‌లో మొదలైన ఈ నిప్పుల తుఫాను.. క్రమంగా సెంట్రల్, ఈస్ట్రన్ యూరప్ దేశాలకూ విస్తరించింది. దశాబ్దాల కాలం నాటి ఉష్ణోగ్రతల రికార్డులన్నీ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోతున్నాయి. డెన్మార్క్‌‌‌‌లో  ఏకంగా 1874 నాటి రికార్డు బద్ధలైంది. దాదాపు 150 ఏండ్ల తర్వాత ఇప్పుడే అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. స్విట్జర్లాండ్‌‌‌‌లో 38.8 డిగ్రీలు, చెక్ రిపబ్లిక్‌‌‌‌లో 40.8 డిగ్రీలతో ఆల్‌‌‌‌టైమ్ రికార్డులు నమోదయ్యాయి. బ్రిటన్‌‌‌‌లో జూన్ నెల చరిత్రలోనే అత్యధికంగా 37.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.

కుప్పకూలుతున్న మౌలిక వసతులు..

ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్  దాటడంతో మిలియన్ల మంది అల్లాడిపోతున్నారు. పశ్చిమ యూరప్‌‌‌‌లో డజన్ల కొద్దీ ప్రాణాలను బలితీసుకుని, వైద్య, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసిన ఈ వడగాలులు ఇప్పుడు జర్మనీ, మధ్య యూరోప్‌‌‌‌ వైపు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో జర్మనీలో రికార్డు స్థాయిలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత చరిత్రతో పోలిస్తే భూమి ప్రమాదకరంగా వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తీవ్ర ఎండలు నమోదైన 1976 నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం 3.5 డిగ్రీలు, భీకర మరణాలు సంభవించిన 2003తో పోలిస్తే ఇప్పుడు 2 డిగ్రీల సెల్సియస్ అదనపు వేడి రికార్డవుతోంది. 50 ఏండ్ల క్రితంతో పోలిస్తే ఇలాంటి వాతావరణ విపత్తులు సంభవించే అవకాశం ఇప్పుడు వందల రెట్లు పెరిగిందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్రమైన వేడి కారణంగా మౌలిక వసతులు కుప్పకూలుతున్నాయి. జర్మనీలో ఎండల తాకిడికి ప్రసిద్ధ ‘ఆటోబాన్ హైవే’పై ఉన్న కాంక్రీట్ స్లాబ్‌‌‌‌లు పేలిపోవడంతో అధికారులు పలు రహదారులను మూసివేశారు. ఫ్రాన్స్‌‌‌‌లో రోడ్లు కరిగిపోతుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. విద్యుత్ అంతరాయాలు, రైళ్ల ఆలస్యంతో ప్రయాణికులు తీవ్ర నరకం చూస్తున్నారు. అణుశక్తి కేంద్రాల్లో కూలింగ్ సమస్యలు తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించినప్పటికీ, ప్రస్తుతానికి సరఫరాకు ఢోకా లేదని అధికారులు చెప్తున్నారు. తీవ్రమైన ఎండల కారణంగా హెల్త్ ఎమర్జెన్సీలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు (65 ఏండ్లు పైబడిన వారు) ఈ వేడికి విలవిల్లాడుతున్నారు. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది. 

ఫ్రాన్స్‌‌‌‌లోనే వెయ్యి మందికిపైగా మృతి..

ఒక్క ఫ్రాన్స్‌‌‌‌లోనే హీట్‌‌‌‌వేవ్ కారణంగా వెయ్యి అదనపు మరణాలు నమోదైనట్టు తెలుస్తోంది. పారిస్ పరిసర ప్రాంతాల్లో మరణాల రేటు వేగంగా పెరుగుతుండటంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. బుధవారం నుంచి దేశంలో అంచనా వేసిన దానికంటే  మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని, ఇందులో ఎక్కువ శాతం 65 ఏళ్లు పైబడిన వృద్ధులేనని, ఇళ్లలోనే మరణించే వారి సంఖ్య 40శాతం పెరిగిందని డబ్ల్యూహెచ్‌‌‌‌వో తెలిపింది. జర్మనీలో ఓ నర్సింగ్ హోమ్‌‌‌‌ను అత్యవసరంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఇటలీ, యూకే దేశాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌‌‌‌లు జారీ చేశారు. యూరప్‌‌‌‌లో ఏటా ఎండల తీవ్రతకు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం జర్మనీ, పోలెండ్, చెక్ రిపబ్లిక్, హంగేరీలాంటి దేశాల్లో 40 డిగ్రీల పైనే ఎండ మంటలు పుడుతుండటంతో లక్షలాది మంది ప్రజలు అల్లాడిపోతున్నారు. నగరాల్లో జనం నీడ కోసం, ఫౌంటెన్ల వద్ద చల్లదనం కోసం పరుగులు తీస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ముప్పు ఎంత వేగంగా దూసుకొస్తుందో చెప్పడానికి యూరప్ ప్రస్తుత పరిస్థితే సజీవ సాక్ష్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గతం నుంచి యూరప్‌‌‌‌ పాఠాలు నేర్చుకోలేదా?

2003 నాటి విపత్తు తర్వాత యూరప్‌‌‌‌ దేశాలు మేల్కొన్నాయి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, చర్యల వల్ల మరణాల రేటు కొంత తగ్గింది. ఒక అధ్యయనం ప్రకారం.. 2003 నాటి వడగాడ్పులు ఇప్పుడు వస్తే, అప్పటితో పోలిస్తే మరణాలు 75% తక్కువగా ఉండే అవకాశం ఉంది. సమస్యల్లా వాతావరణ మార్పుల తీవ్రత వేగంగా పెరుగు తుండటమే. ఈ ఏడాది మేలోనే బ్రిటన్‌‌‌‌లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డబ్ల్యూహెచ్‌‌‌‌వో యూరప్ చీఫ్ హన్స్ క్లూగే బెర్లిన్‌‌‌‌లో కొత్త గైడ్​లైన్స్​ రిలీజ్​ చేసిన 2 వారాలకే, అక్కడ 40 డిగ్రీల సెల్సియస్ వేడి నమోదైంది. ‘‘ఇదొక పెద్ద విషాదం. గత నాలుగేండ్లలో యూరప్‌‌‌‌లో వేడి వల్ల 2 లక్షల మంది చనిపోయారు. ఇందులో మెజారిటీ మరణాలను నివారించవచ్చు. కానీ విఫలమయ్యాం. ఇది కేవలం శాంపిల్‌‌‌‌ మాత్రమే.. భవిష్యత్తులో మిలియన్ల మంది ప్రభావితం అవుతారు’’ అని క్లూగే ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్కిటిక్ మంచు స్పీడ్​గా కరగడం వల్ల యూరప్‌‌‌‌ ఖండం వేగంగా వేడెక్కుతోందని, వాతావరణ మార్పులే ఈ విపత్తుకు కారణమన్నారు.

ఎండల తీవ్రతకు కారణం ‘హీట్ డోమ్’ ప్రభావమేనా..!

జూన్ నెలలోనే ఈ స్థాయిలో రికార్డులు బద్ధలు కావడానికి వాతావరణంలో ఏర్పడిన ‘హీట్ డోమ్’  ప్రభావం ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నా రు. ఈ వాతావరణ వ్యవస్థలో వేడి గాలి పైకి పోకుండా వాతావరణం కిందికి నొక్కి ఉంచుతుంది. అది భూమిని తాకినప్పుడు మరింతగా సంకోచించి విపరీతంగా వేడెక్కుతుంది. ఈ ప్రక్రియ వల్ల మేఘాలు ఏర్పడే అవకాశం లేకపోవడంతో, తీవ్రమైన సూర్యరశ్మి నేరుగా భూమిని తాకి ఉష్ణోగ్రతలను అసాధారణ స్థాయికి పెంచేస్తుంది. వాతావరణ మార్పుల వల్లే ఈ విపత్తు సంభవిస్తోందని, ఒకప్పుడు ‘తరానికి ఒకసారి’ వచ్చే ఇలాంటి వడగాలులు.. ఇప్పుడు ప్రతి ఏటా వస్తున్నాయని డబ్ల్యూహెచ్‌‌‌‌వో అధినేత టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ  వేసవి వడగాలులు వందలాది అదనపు మరణాలకు కారణమవుతున్నాయని అన్నారు. యూరప్‌‌‌‌ ప్రస్తుత పరిస్థితులపై ‘ఎక్స్‌‌‌‌’ వేదికగా టెడ్రోస్‌‌‌‌ స్పందించారు. ‘‘వేడి వల్ల వచ్చే శారీరక ఒత్తిడిని (హీట్ స్ట్రెస్) తరచుగా ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు. యూరప్‌‌‌‌లోని ఇళ్లు, ఆఫీసులు, స్కూళ్లు ఇంతటి భారీ ఉష్ణోగ్రతలను తట్టుకునేలా నిర్మించలేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. మిలియన్ల మంది ప్రజలు ప్రస్తుతం తీవ్రమైన వేడి కింద బతుకుతున్నారని, వందలాది మంది మరణించారని, పాఠశాలలు మూతపడ్డాయని, పవర్ గ్రిడ్‌‌‌‌లు కుప్పకూలుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శిలాజ ఇంధనాల వాడకం బంద్ చేయాలె

బొగ్గు, చమురు, గ్యాస్‌‌‌‌లాంటి శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా దహనం చేయడం వల్ల పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి కాలంతో పోలిస్తే భూమి ఇప్పటికే 1.4 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది. దీనివల్లే వడగాలులులాంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు తరచూ సంభవిస్తున్నాయని, భూతాపాన్ని నియంత్రించకుంటే మున్ముందు మరిన్ని ఘోరాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్ పరిశోధించిన యూరప్‌‌‌‌లోని దాదాపు 850 నగరాల్లో, సుమారు 45% నగరాలు జూన్ నెలలో తమ ఆల్-టైమ్ ‘హీట్ స్ట్రెస్’ (అత్యధిక వేడి) రికార్డులను బద్ధలుకొట్టాయి. మరికొన్ని నగరాలు ఈ రికార్డును దాటేలా కొనసాగుతున్నాయి. ‘‘ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ నమూనా పెద్ద వింతేమీ కాదు, కానీ అందులో నమోదవుతున్న ఉష్ణోగ్రతలే అత్యంత అసాధారణం. మానవ తప్పిదాల వల్ల వాతావరణం కలుషితం కాకపోతే ఇంతటి వేడి ఉండేది కాదు” అని వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్ కోఫౌండర్​ ఫ్రెడరికే ఒట్టో వ్యాఖ్యానించారు. యూరప్‌‌‌‌లో ఈ నెలలో వచ్చిన హీట్‌‌‌‌వేవ్ రెండోది కావడం విశేషం. దీనికి ముందు మే నెలలోనే ఎండలు పశ్చిమ, మధ్య యూరప్‌‌‌‌ను అతలాకుతలం చేశాయి. భవిష్యత్తులో ఇంతకు మించిన ఉష్ణోగ్రతలను, వినాశనాన్ని అడ్డుకోవాలంటే.. శిలాజ ఇంధనాల వాడకాన్ని తక్షణమే, వేగంగా తగ్గించడం ఒక్కటే మార్గమని శాస్త్రవేత్తల నివేదిక తేల్చిచెప్పింది.