జీ20 తీర్మానానికి సభ్య దేశాల ఆమోదం

జీ20 తీర్మానానికి సభ్య దేశాల ఆమోదం

జోహన్నెస్​బర్గ్: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్‎లో జరుగుతున్న జీ20 సదస్సులో తీర్మానానికి సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. డిక్లరేషన్‎ను అడ్డుకోవడానికి అమెరికా యత్నించినా.. సభ్య దేశాల అధినేతల ఏకాభిప్రాయం వెల్లడించారు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాలు, సహకార శాఖల మంత్రి రొనాల్డ్ లామోలా వెల్లడించారు. ఆ దేశ టీవీ చానెల్ సౌత్ ఆఫ్రికా బ్రాడ్ కాస్టింగ్‎తో ఆయన మాట్లాడారు.

‘‘జీ20 డిక్లరేషన్‎కు ఆమోదం తెలపడం మనకు గ్రేట్ మూమెంట్. ఆఫ్రికా ఖండంలో ఈ డిక్లరేషన్  విప్లవాత్మక మార్పులు తెస్తుంది. సాధారణంగా సదస్సు చివర్లో తీర్మానాన్ని పాస్ చేస్తుంటారు. ఈసారి సమిట్ ప్రారంభంలోనే తీర్మానానికి ఆమోదం తెలిపాం. జీ20 సభ్య దేశాల ప్రతినిధుల (షెర్పాలు) తో సంప్రదింపులు జరిపి ఆమోదించాం. సదస్సుకు హాజరైన వివిధ దేశాల లీడర్లకు షెర్పాలు అంతకుముందు డిక్లరేషన్  గురించి వివరించారు.

సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో డిక్లరేషన్‎ను ఎవరూ అడ్డుకోలేకపోయారు” అని లామోలా పేర్కొన్నారు. కాగా.. జీ20 సమిట్​లో ఈ ఏడాది అమెరికా పాల్గొనలేదు. అయితే, మిత్ర దేశాల సహకారంతో జీ20 తీర్మానాన్ని అడ్డుకోవడానికి   ప్రయత్నించింది. దీనిపై లామోలా స్పందిస్తూ.. అమెరికా ఉన్నా, లేకపోయినా జీ20 కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.