- ఏప్రిల్1న సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. 9న నర్సింగ్ ఆఫీసర్ల సెలక్షన్ లిస్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదివారం మెరిట్ లిస్టును విడుదల చేసింది. ప్రధానంగా నాలుగు విభాగాలకు చెందిన అభ్యర్థుల వివరాలను బోర్డు ప్రకటించింది. గైనకాలజీ (90), అనస్తీషియా (44), పీడియాట్రిక్స్ (28), ఆర్థోపెడిక్స్ (12) డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి.
ఈ లిస్టులోని అభ్యర్థులకు ఏప్రిల్1న హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు బోర్డు స్పష్టం చేసింది. సర్టిఫికెట్ల తనిఖీ పూర్తయిన వెంటనే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తామని బోర్డు ప్రకటించింది.
మరోవైపు నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 2,312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీపై కూడా కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫైనల్ మెరిట్, సెలక్షన్ లిస్ట్‌ను ఏప్రిల్ 9 నాటికి విడుదల చేయనున్నారు.
