మెట్రో సర్వేలెన్స్ యూనిట్ 28న ప్రారంభం

మెట్రో సర్వేలెన్స్ యూనిట్ 28న ప్రారంభం
  • ఇన్​ఫెక్షన్ వ్యాధులను ముందే గుర్తించి నియంత్రిస్తుంది 
  • నీళ్లు, గాలి, ఆహార కలుషిత, వెక్టర్ బోర్న్, జూనోటిక్ వ్యాధులపై నిఘా
  • వ్యాప్తి చెందక ముందే హెచ్చరికలు
  • ర్యాండమ్​గా శ్యాంపిల్స్.. ఐపీఎంలో తాత్కాలిక టెస్టులు 
  • వెక్టర్ బోర్న్ డిసీజ్ యాప్​తో రియల్ టైమ్ సర్వేలెన్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇన్ ఫెక్షన్ వ్యాధులను ముందే గుర్తించి నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన మెట్రో సర్వైలెన్స్ యూనిట్(ఎంఎస్​యూ) ఈ నెల 28న ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించిన ల్యాబ్ నారాయణగూడలోని ఐపీఎంలో,  కమాండ్ కంట్రోల్ రూమ్ సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఐపీఎంలో ఇందుకు సంబంధించి బిల్డింగ్ మాత్రమే నిర్మించాల్సి ఉంది. అప్పటి వరకు ఐపీఎం ల్యాబ్ లోనే టెస్టులు చేయనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో 17 శాఖలకు సంబంధించి 23 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. వీరు హరిహర కళాభవన్  నుంచి మానిటరింగ్ చేయనున్నారు.

రెగ్యులర్​గా సిటీలో ఎక్కడైనా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా లేదా ఏదైనా అనుమానం వచ్చిన  ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ర్యాండమ్ గా శ్యాంపిల్స్ సేకరించనున్నారు. దోమల ద్వారా వ్యాపించే (వెక్టర్ బోర్న్)వ్యాధులు, జంతువుల నుంచి మనుషులకు సోకే (జూనోటిక్) వ్యాధులు, నీళ్లు, గాలి, ఆహార కలుషితానికి సంబంధించిన బ్లడ్, వాటర్, ఎయిర్​, సాయిల్ శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపనున్నారు. రిపోర్టుల ఆధారంగా  సమస్యలను గుర్తించి  వెంటనే నివారణకు సంబంధించి వైద్యాశాఖ అధికారులకు సమాచారాన్ని అందించనున్నారు. 

కరోనా తర్వాత కేంద్రం అలెర్ట్..
కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా అలెర్ట్ అయ్యింది. ఎటువంటి వైరస్ లు వచ్చిన కూడా ముందస్తుగా ఎదుర్కొనేందుకు   మెట్రోపాలిటన్ సిటీలను ముందస్తుగా అప్రమత్తం చేయడంతో పాటు  వ్యాధులు, వైరస్ లను గుర్తించి నివారణ కు చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లో భాగంగా హైదరాబాద్ నగరంలో  ఎంఎస్ యూ ఏర్పాటు చేసింది.  అంతర్జాతీయ సంస్థ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యూఎన్ డీపీ) సిఫార్సు మేరకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.  జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో  కొనసాగే ఈ సెంటర్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం  రూ.20 కోట్లను జీహెచ్ఎంసీకి విడుదల చేసింది. 

యాప్ ద్వారా మానిటరింగ్..
ఈ సర్వైలెన్స్ వ్యవస్థను అత్యాధునిక సాంకేతికతతో  మరింత పకడ్బందీగా అమలు చేయనున్నారు. ఇందుకోసం ఫీల్డ్​ లెవెల్​లో యాప్​ని  వినియోగించనున్నారు. ఇప్పటికే 'వెక్టర్ బోర్న్ డిసీజ్ యాప్'  వినియోగంలోకి వచ్చింది. దోమలకి సంబంధించి ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ కంప్లయింట్స్​ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎంఎస్ యూ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

ఇప్పటికే మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు రియల్-టైమ్ సర్వైలెన్స్ కొనసాగనున్నది. ఎక్కడెక్కడ ఏయే వ్యాధులు ప్రబలుతున్నాయి? ఏ బస్తీలో ఏ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి? అన్న డేటాను నిమిషాల వ్యవధిలో కంట్రోల్ రూమ్‌‌కు, సంబంధిత అధికారులకు అందజేస్తుంది. పూర్తి స్థాయిలో అంబాబాటులోకి వచ్చిన తర్వాత వెక్టర్ బోర్న్ డిసీజ్ యాప్ స్థానంలో కొత్త యాప్ ఏదైనా తీసుకొచ్చి అన్నింటికి సంబంధించి చర్యలు తీసుకోనున్నారు.