- త్వరలో ఆటోలు, ఉబర్ లతోనూ కనెక్టివిటీ చేస్తామని ప్రకటన
- మెట్రో కామన్ పాస్ తీరును పరిశీలించిన ప్రజాప్రతినిధులు
- ప్రయాణికులపై భారం పడనివ్వం: మంత్రి పొన్నం
- ధరలపై పునరాలోచిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సిటీ ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగే (సీమ్‌లెస్) ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. ట్రాఫిక్ కష్టాలు తగ్గించి, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ప్రోత్సహించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి కామన్ మొబిలిటీ పాస్ అమలు తీరును పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీగణేష్, నవీన్ యాదవ్, ఉన్నతాధికారులు కలిసి శనివారం ప్రయాణించారు.
బేగంపేట మెట్రో స్టేషన్ లో కామన్ పాస్ తీసుకుని మెట్రో రైలులో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ప్రయాణించిన బృందం, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కి నేరుగా సెక్రటేరియట్ కు చేరుకుంది. ఈ ప్రయాణంలో సాధారణ ప్రయాణికులతో నేరుగా మాట్లాడి కామన్ పాస్ పనితీరు, మెట్రో-బస్సు కనెక్టివిటీ, ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, రవాణా శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు ఎన్.వి.ఎస్.రెడ్డి, మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ ఎండీ బి.అజిత్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కామన్ పాస్ తో జర్నీ ఈజీ
జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ నగరవాసుల ప్రయాణ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే మెట్రో, ఆర్టీసీ సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చామన్నారు. మెట్రో దిగిన తర్వాత ప్రయాణికులు తమ ఇళ్లు, ఆఫీసులకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల అనుసంధానం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రౌండ్ లెవల్ లో పనితీరు తెలుసుకునేందుకే తామంతా స్వయంగా వన్ డే కామన్ పాస్ కొనుగోలు చేసి ప్రయాణించామన్నారు. ప్రస్తుతం మెట్రో, బస్సులను కలిపి తీసుకొచ్చిన ఈ పాస్ విధానాన్ని రాబోయే రోజుల్లో ఆటోలు, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులతోనూ అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, అక్కడి నుంచి గమ్యస్థానానికి వెళ్లే దాకా ఒకే వ్యవస్థను తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ప్రజలపై భారం పడకుండా చర్యలు: మంత్రి పొన్నం
ప్రజలను సొంత వాహనాల నుంచి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వైపు ఆకర్షించేందుకే ఈ కామన్ పాస్ ను రోజువారీ, నెలవారీ పాస్ ల రూపంలో ప్రవేశపెట్టామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే కామన్ పాస్ చార్జీలు కొంత ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారని, ప్రస్తుతం ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రయాణికుల నుంచి వచ్చే పూర్తి ఫీడ్ బ్యాక్ ను తీసుకుని, ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా ధరలపై సమీక్షించి అవసరమైన మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు.
ధరల అంశాన్ని సమీక్షిస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి
కమ్యూటర్లకు మెట్రో, బస్సుల మధ్య కనెక్టివిటీ ఇచ్చి సమయం ఆదా చేయడమే ఈ కామన్ పాస్ ఉద్దేశమని మంత్రి వివేక్ వెంకటస్వామి వివరించారు. ప్రయాణికులతో మాట్లాడినప్పుడు పాస్ ధరలు కొంత ఎక్కువ ఉన్నాయన్న అంశాన్ని లేవనెత్తారని, ప్రభుత్వం దీనిపై పునరాలోచిస్తుందని చెప్పారు. ప్రయాణికులకు నిజమైన ఆర్థిక వెసులుబాటు, ప్రయాణ సౌలభ్యం కలిగేలా మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
ఆటో కార్మికులకు వెల్ఫేర్ బోర్డు
ఆటో కార్మికులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆటో డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలన్నింటినీ మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. శనివారం రాత్రి ప్రజాభవన్ లో హైదరాబాద్ నగర ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ నాయకులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆత్మీయ విందు ఇచ్చారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆటో సంఘాల నాయకులతో భోజనం చేశారు.
అనంతరం జరిగిన సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఆటో ఛార్జీల పెంపుపై డ్రైవర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం.. కిలోమీటర్‌కు రూ.11గా ఉన్న ఛార్జీని రూ.14కు పెంచుతూ జీఓ జారీ చేసిందన్నారు. రవాణా రంగంలో ఉన్న దాదాపు 20 లక్షల కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇప్పటికే కేబినెట్‌లో చర్చించామని చెప్పారు. డీజిల్ ఆటోలను బ్యాటరీ ఆటోలుగా మార్చేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ కార్యక్రమం కింద రూ.200 కోట్లను కేటాయించామని తెలిపారు. ఒక్కో ఆటోకు ప్రభుత్వం తరఫున రూ.1.50 లక్షల సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో సోలార్, బ్యాటరీ, సీఎన్‌జీ ఆటోలకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.
