- రన్నరప్స్ గా థాయ్లాండ్, వెనెజువెలా భామలు
- ఇండియాకు నిరాశ.. టాప్ 12లో మణికకు దక్కని చోటు
బ్యాంకాక్: విశ్వ సుందరి అందాల పోటీల్లో మెక్సికన్ భామ ఫాతిమా బాష్ ఫెర్నాండెజ్(25) మెరిశారు. శుక్రవారం థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగిన 74వ మిస్ యూనివర్స్(2025) పోటీల్లో కిరీటాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. అవమానం ఎదుర్కొన్న వేదికపైనే విజేతగా నిలిచి సత్తా చాటారు. వేదికపై ఫాతిమా బాష్ కు మిస్ యూనివర్స్ 2024 విక్టోరియా కజియార్ తీల్వింగ్(డెన్మార్క్) తన కిరీటాన్ని తొడిగారు.
ఈ పోటీల్లో థాయ్ లాండ్ కు చెందిన ప్రవీనర్ సింగ్(29) ఫస్ట్ రన్నరప్ గా, వెనెజువెలాకు చెందిన స్టెఫానీ అడ్రియానా అబాసలీ నాసర్ (25) సెకండ్ రన్నరప్ గా నిలిచారు. ఫిలిప్పీన్స్ భామ అతిషా మనాలో(28), ఐవరీ కోస్ట్ భామ ఒలీవియా యేస్(27)లకు నాలుగు, ఐదో స్థానాలు దక్కాయి. ఇక ఈ పోటీల్లో భారత్ కు నిరాశే ఎదురైంది. సాయంత్రం గౌన్ రౌండ్ లో మిస్ ఇండియా యూనివర్స్ 2025 మణికా విశ్వకర్మ (22) టాప్ 12లోకి చేరలేకపోయారు. అంతకుముందు జరిగిన స్విమ్ సూట్ రౌండ్ లో మాత్రం ఆమె టాప్ 30లోకి చేరుకోగలిగారు. కాగా, ఈ పోటీల్లో మొత్తం 130 దేశాలకు చెందిన భామలు పోటీ పడ్డారు. జడ్జింగ్ ప్యానెల్ లో మన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కూడా ఒక మెంబర్ గా వ్యవహరించారు.
అవమానం జరిగిన చోటే విజేతగా..
చిన్నప్పుడు డిస్లెక్సియా(మెదడులో సమస్య కారణంగా చదవడం, రాయడంలో ఇబ్బంది కలగడం), హైపర్ యాక్టివిటీ డిజార్డర్(దేనిపైనా కాన్ సెంట్రేట్ చేయలేకపోవడం) వంటి సమస్యలతో బాధపడిన ఫాతిమా బాష్ వాటిని సమర్థంగా ఎదుర్కొని ఎదిగారు. ఫ్యాషన్ డిజైన్ గా చేసి మోడల్ గా మారారు. 2025 మిస్ మెక్సికో యూనివర్స్ గా గెలిచి, మెక్సికో తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నారు.
అయితే, థాయ్ లాండ్ లో మిస్ యూనివర్స్ పోటీల సందర్భంగా ఫాతిమాకు, థాయ్ నేషనల్ డైరెక్టర్ నవాత్ ఇత్సారగ్రిసిల్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన గైడ్ లైన్స్ పాటించనందుకు ఫాతిమాను తెలివితక్కువ దానివంటూ ఆయన తిట్టడం, ఆమె నిరసన తెలుపుతూ వేదిక నుంచి వెళ్లిపోవడం సంచలనంగా మారింది. ఫాతిమాకు మద్దతుగా ఇతర కంటెస్టెంట్లు కూడా వాకౌట్ చేయడంతో చివరకు వారికి నవాత్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తాజాగా ఇదే వేదికపై విజేతగా నిలవడం ద్వారా తనపై విమర్శలకు ఫాతిమా గట్టి సమాధానం ఇచ్చినట్టయింది.
