
- భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వండి
- సిరిసిల్ల కలెక్టరేట్‌ను ముట్టడించిన మిడ్ మానేరు నిర్వాసితులు
- రాజన్న సాక్షిగా నిర్వాసితులకు మాటిచ్చి మరిచావ్..
- డబుల్ బెడ్రూం ఇండ్లు, రెండు లక్షల ప్యాకేజీ ఏదీ?
- ఐదు వేల మందితో పాదయాత్ర.. పోలీసు బందోబస్తు
- సీఎం కేసీఆర్ తీరు సరిగా లేదు: జీవన్‌రెడ్డి
- బాధితుల పక్షాన పోరాడుతం: పొన్నం
రాజన్నసిరిసిల్ల, వెలుగు: మిడ్‌మానేరు ప్రాజెక్టులో ముంపునకు గురైన 12 గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలంటూ నిర్వాసితులు, అఖిలపక్షాల నేతలు బుధవారం ఆందోళన చేశారు. సుమారు ఐదు వేల మంది నిర్వాసిత గ్రామాల మీదుగా మహా పాదయాత్ర నిర్వహించి.. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేశారు. మిడ్ మానేరు ముంపు బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన మహా పాదయాత్ర.. సాయంత్రం నాలుగు గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకుంది. కార్యక్రమంలో ఉద్రిక్తత తలెత్తకుండా దారి పొడవునా వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పాదయాత్ర సిరిసిల్ల కలెక్టరేట్ వద్దకు చేరుకున్నాక కాంగ్రెస్ సీనియర్ నేతలు జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు మాట్లాడారు.
ఓట్లు దండుకుని..
మిడ్ మానేరు నిర్వాసితులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని జీవన్‌రెడ్డి చెప్పారు. కానీ సీఎం కేసీఆర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘నిర్వాసితుల సమస్యలు తీర్చుతామని, అవసరమైతే ఇక్కడే తిని ఇక్కడే పందామంటూ మిడ్ మానేరు వద్ద కేసీఆర్ ధర్నా చేశారు. నిర్వాసితుల ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయ్యారు. ఆ విషయాన్ని మర్చిపోయారు. తర్వాత నాలుగేండ్ల కింద మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తమని ఎములాడ రాజన్న మెట్ల దగ్గర మాటిచ్చారు. కానీ అమలు కాలేదు. రాజన్నమెట్లపై ఇచ్చిన మాటకే విలువ లేకుంటే ఎట్లా.. భూసేకరణ చట్టానికి అనుగుణంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ పరిహారం ఇయ్యాలె. రూ.2 లక్షల ప్యాకేజీ, ఇంటి స్థలం ఇయ్యాలె..”అని డిమాండ్ చేశారు.
బంధువులకు ఇచ్చుకుంటే చాలా?: పొన్నం
మిడ్‌మానేర్ నిర్వాసితుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. సీఎం కేసీఆర్ మిడ్‌మానేరు ముంపు కింద ఎంపీ సంతోష్‌రావుకు, ఆయన సోదరికి పరిహారంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఇంటి స్థలం కూడా ఇచ్చారన్నారు. అంతా బంధువులకు ఇచ్చుకుంటే చాలా? అని ప్రశ్నించారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వడానికి మాత్రం కేసీఆర్‌కు చేతులు రావడం లేదని విమర్శించారు.
చింతమడక సీఎంవా?: బొడిగె శోభ
కేసీఆర్ చింతమడకకు సర్పంచా.. తెలంగాణకు ముఖ్యమంత్రా అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రశ్నించారు. చింతమడక ప్రజలు ఏం త్యాగం చేశారని ఇంటికి పది లక్షలు ఇస్తున్నారని, మిడ్ మానేరు నిర్వాసితుల కష్టాలు పట్టించుకోవడం లేదేమని నిలదీశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం తీవ్రతరం చేస్తామన్నారు. పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీఎస్పీ నేత అంకని భాను, ముంపు గ్రామాల ప్రతినిధులు కూస రవీందర్, రేగులపాటి సుభాష్‌రావు, పిల్లి కనకయ్య, ఎర్రం రాజు, నవీన్ యాదవ్, కదిరె రాజు తదితరులు పాల్గొన్నారు.
చింతమడకకు ఇస్తరు.. నిర్వాసితులకు లేవా?
కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం అసెంబ్లీ, సెక్రటేరియెట్‌ను కూల్చి, కొత్తవి కడతానని అంటున్నారని.. నిర్వాసితులకు ఇండ్లు కట్టించడానికి మాత్రం పైసల్లేవా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. పుట్టిన ఊరు చింతమడకలో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తానంటున్న కేసీఆర్.. మిడ్‌మానేరులో సర్వం కోల్పోయిన వారికి పరిహారంపై స్పందించడం లేదేమని నిలదీశారు. ఈ తీరు సరికాదని, నిర్వాసితుల ఉసురు పోసుకోవద్దన్నారు. నిర్వాసితుల్లో యువతకు విద్యార్హతకు అనుగుణంగా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మహా పాదయాత్ర ప్రారంభమేనని, సర్కారు స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కేసీఆర్ మిడ్‌మానేరు ముంపు కింద తన కుటుంబాలకు మాత్రం పరిహారం, ఇండ్లు ఇచ్చుకున్నారని.. నిర్వాసితులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నారని, నిర్వాసితులకు ఇండ్లు కట్టించేలా సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయనకు టైం లేదని విమర్శించారు.