మొన్నటి వరకు నీళ్లు లేక వెలవెలబోయిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గాయత్రి పంప్ హౌస్ కు, అక్కడి నుంచి వరద కాల్వ ద్వారా మిడ్ మానేరుకు నీళ్లు తరలిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.819 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
గాయత్రి పంప్ హౌస్ నుంచి 15,850 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేరుకు పంపింగ్ చేస్తున్నారు. మిడ్ మానేరులో నీరు చేరడంతో ఈ ప్రాజెక్టు కింద ఉన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండె కాయలాంటి మిడ్ మానేరు ప్రాజెక్ట్ నుంచే కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ కు నీళ్లు సరఫరా చేయనున్నారు. -
