వలస కూలీలు బడా కంపెనీల్లో బందీలు

వలస కూలీలు బడా కంపెనీల్లో బందీలు

హైదరాబాద్, వెలుగువలస కార్మికులు తమ సొంత ఊర్లకు వెళ్లొచ్చని, ఆయా రాష్ట్రాలు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో ఎప్పుడెప్పుడు తమ ఆత్మీయుల వద్దకు వెళ్దామా అనే కూలీలు ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడి ప్రభుత్వం, అధికార యంత్రాంగం నుంచి ఆశించిన స్పందన కనిపించకపోవడంతో వలస కార్మికుల్లో అసహనం పెరిగింది.

చాలా చోట్ల ఆందోళనలు

  • తమను సొంతూళ్లకు పంపాలంటూ షేక్​పేట్​లోని ఓ కంపెనీ ముందు వందలాది మంది కూలీలు ఆందోళనకు దిగారు.
  • రామచంద్రాపురం తహసీల్దార్​ కార్యాలయం ముందు వర్కర్లు నిరసన చేపట్టారు. ఊళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని ఎమ్మార్వో హామీ ఇవ్వడంతో కూలీలు వెనక్కితగ్గారు.
  • బీహార్, జార్ఖండ్, యూపీ, చత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన దాదాపు 3 వేల మంది శంషాబాద్‌లో ఓ సంస్థలో కీలకమైన పనుల్లో ఉన్నారు. తమను సొంతూళ్లకు పంపాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి.. ‘‘మీరు వెళ్లేందుకు ఇంకా 15 రోజులు పడుతుంది”అని చెప్పడంతో తాముంటున్న ప్రాంతం నుంచి బయటకు పరుగులు తీశారు.
  • రాయదుర్గం, గోల్కొండ పీఎస్‌ల వద్దకు బీహార్‌, జార్ఖండ్‌ కార్మికులు వందల సంఖ్యలో వచ్చి ఆందోళనకు దిగారు.
  • బకాయిలిస్తే వెళ్తామని ఇంకో కంపెనీ వద్ద కార్మికులు గొడవ చేశారు.

తొలుత సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీలో కార్మికులు ఆందోళన చేపట్టారు. దాంతో వారిని ప్రత్యేక రైలులో జార్ఖండ్‌‌‌‌కు పంపించారు. ఈ విషయం తెలిసిన ఇతర కార్మికుల్లో ఆశలు పెరిగాయి. తమను కూడా పంపిస్తారని సిటీలోని స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు సమీపంలోని రైల్వే, బస్‌‌‌‌ స్టేషన్లకు వెళ్లారు. కొందరు కాలినడకనే తమ ప్రాంతాలకు బయలుదేరారు. వీరిలో చాలామందిని పోలీసులు, అధికార యంత్రాంగం ఆపేశారు. దీంతో కూలీలు నిరసనలకు దిగారు.

పోలీస్ స్టేషన్లలో నమోదు చేసుకున్నా..

వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లాలంటే పోలీస్‌‌‌‌ స్టేషన్లలో పేర్లు నమోదు చేయించుకోవాలనే సమాచారం అందింది. దాంతో వందల సంఖ్యలో కార్మికులు తమ ఆధార్‌‌‌‌ కార్డులు పట్టుకొని పీఎస్‌‌‌‌ల దగ్గరకు చేరుకున్నారు. పోలీసు స్టేషన్లకు వస్తున్న కూలీలకు సాధ్యమైనంత వరకు ఇక్కడే ఉండాలని నచ్చజెబుతున్నారు. త్వరలోనే తిరిగి పనుల్లో చేరుతారని, ఊళ్లకు వెళితే కష్టాలు పడుతారని సముదాయిస్తున్నారు. వసతులు లేని వారికి యజమానులు ద్వారా వసతి కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంత చెప్పిన వినకుంటే.. కూలీల వివరాలను ఆన్​లైన్​లో ఎంట్రీ చేసి ఫోన్​కు మెసెజ్ వచ్చినపుడు రైల్వేస్టేషన్లకు వెళ్లాలని చెప్పి పంపుతున్నారు.

పంపియ్యరు.. పోనియ్యరు..

వలస కూలీలకు తమ సొంతూళ్లకు చేర్చేందుకు కేంద్రం ప్రత్యేకంగా శ్రామిక్​ రైళ్లను నడపనుంది. అయితే ఆ రైళ్లలో వెళ్లాలంటే ఏం చేయాలో తెలియక కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. స్టేషన్‌‌‌‌కు వెళ్తే రైలు ఎక్కొచ్చని బయలుదేరామని, కానీ పోలీసులు ఎక్కడికక్కడ ఆపేస్తున్నారని బేగంపేటలో కొందరు కూలీలు చెప్పారు. పీఎస్‌‌‌‌లో రిజిస్ట్రేషన్‌‌‌‌ చేసుకుంటేనే వెళ్లనిస్తామని అంటున్నారని, కానీ అక్కడ పేర్లు నమోదు చేయించుకున్నా పంపడం లేదని చెప్పారు. నడుచుకుంటూ వెళ్తామని, పర్మిషన్ ఇవ్వాలని అడిగినా ఒప్పుకోవడం లేదని వాపోయారు.

సొంత వాహనాలు ఉంటే పాసులు

వలస కార్మికులు సొంత వాహనాల్లో వెళ్తామంటే స్థానిక పోలీస్​స్టేషన్​లో పాస్ తీసుకొని వెళ్లేందుకు అధికారులు వెసులుబాటు కల్పించారు. వాహనాల పత్రాలు, డ్రైవర్ వివరాలు,  వలస కూలీల వివరాలు తీసుకుంటున్నారు. అన్ని కరెక్ట్​గా ఉంటే పాస్ జారీ చేస్తున్నారు. మరోవైపు మేడ్చల్‌‌‌‌ మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వలస కార్మికులను పోలీసులే స్వయంగా అటుగా వెళ్తున్న లారీలను ఆపి అందులో ఎక్కించి పంపడం కనిపించింది. సంగారెడ్డి–ముంబై రహదారిలో కొందరు రాజకీయ నాయకులు స్వయంగా వాహనాలు ఏర్పాటు చేసి కార్మికులను పంపే ప్రయత్నం చేశారు.

కొన్నిచోట్ల పనుల్లో చేరిన కార్మికులు

భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శివారు ప్రాంతాల్లో సోమవారం పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 42 రోజుల తర్వాత పనుల్లో చేరడంపై కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే సొంతూళ్లకు వెళ్లబోమని అంటున్నారు.

ఎన్నో నిర్బంధాలు

  • గచ్చిబౌలి సమీపంలోని ఒక బడా కంపెనీ సోమవారం కొందరు కార్మికులను నిర్బంధిస్తే వాళ్లు తాము నివాసముండే షెడ్లను పగలగొట్టుకొని బయటకు వచ్చారు.
  • శంషాబాద్‌‌‌‌ వద్ద ఉండే మరో బడా నిర్మాణ సంస్థ 3 వేల మంది కార్మికులను నిర్బంధించే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడున్న పోలీసులను కూడా ధిక్కరించి కూలీలు రోడ్ల మీదికి వచ్చారు. ఊరి బాట పట్టారు.
  • అందరికీ పని కల్పిస్తామనీ, జీతాల కోసం మాత్రం రెండు మూడు నెలలు ఆగాలని ఇంకో కంపెనీ చెప్పడంతో కూలీలు తిరగబడ్డారు. తమను ఊర్లకు పంపించాలంటూ గొడవ చేశారు.