
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిటీ నుంచి సొంతూళ్ల బాట పట్టారు. వివిధ జిల్లాలకు వెళ్లేవారు ఒకరోజు ముందుగానే బయలుదేరారు. పోలింగ్ సందర్భంగా స్కూళ్లకు నేడు, రేపు రెండు రోజులు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం నుంచే కుటుంబాలతో వెళ్తుండగా బస్టాండ్లలో రద్దీ కనిపించింది. రెండు మూడు రోజులుగా అడ్డాలపై కూలీలు కూడా పెద్దగా కనిపించలేదు. వలస ఓటర్లను సొంతూళ్లకు రావాలని ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు కోరారు. కొద్దిరోజులుగా అభ్యర్థులు కూడా సిటీకి వచ్చి తమ సెగ్మెంట్లలోని ఓటర్లతోనూ ఆత్మీయ సమ్మేళనాలు సైతం నిర్వహించారు. తప్పకుండా వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని జిల్లాలకు చెందినవారు..
సిటీలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన వారు నివసిస్తుంటారు. నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందినవారు ఎక్కువగా ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్, బీఎన్‌రెడ్డి నగర్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో ఉంటారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు మెహిదీపట్నం వైపు, వరంగల్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల వారు ఎల్ బీనగర్, ఉప్పల్ వైపు, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు లింగంపల్లి, బాలానగర్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివసిస్తుంటారు.
ఎప్పుడొస్తరని ఫోన్లు
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఈసారి వలస ఓటర్లపై దృష్టి సారించారు. డైలీ ఫోన్లు చేసి ఎప్పడొస్తున్నారని ఆయా పార్టీల లోకల్ లీడర్లు అడుగుతున్నారు. ఓటర్ల జాబితాల్లోని వివరాలు తెలుసుకుని వారికి ఫోన్లు చేసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పోలింగ్ రోజు వచ్చేందుకు అవసరమైన ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కొందరు ఓటర్లను తరలించే పనిలో ఉన్నారు.