వరి పొలాల్లో వలస కూలీలు

వరి పొలాల్లో వలస కూలీలు
  • ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి కూలీల రాక
  • ఉమ్మడి వరంగల్లోని పలు ప్రాంతాల్లో పనులు
  • ఊపందుకున్న వరి నాట్లు

పొట్టకూటి కోసం వందల మైళ్ల దూరాన్ని దాటి వస్తున్నారు ఎందరో కూలీలు. ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి  కూలీలు వలస వస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో వలస కూలీలు దర్శనమిస్తున్నారు. చెరువులు, కుంటలు, వ్యవసాయ బావుల నిండా దండిగా నీరు ఉండటంతో తమ పొలాల్లో వరి నాటు వేసేందుకు రైతులు ఈ వలస కూలీలపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. స్థానికంగా కూలీల కొరత ఉండటంతో రైతులు బయటి రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. దీంతో వరి నాట్లు ఊపందుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో వరి వేయద్దని, వేసిన ప్రభుత్వం ధాన్యాన్ని కొనబోదని తెలిపిన నేపథ్యంలో చాలా మంది రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ ప్రభుత్వం ధాన్యం కొనకపోతే ఎట్లా అనే డైలమాతో చాలామంది రైతులు పొలాలు దున్నలేదు. కానీ బావులు, చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో రైతులు వరి పంట వేయడానికే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలోనే కొంత ఆలస్యం అయిందని, దాంతో కూలీల కొరత ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మహిళలే కాకుండా పురుషులు కూడా వచ్చారు. ఆడవాళ్ల కంటే మగవాళ్లే స్పీడుగా నాట్లు వేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఎకరాల కొద్దీ పొలాలను గుత్తగా మాట్లాడుకుని పొద్దుపోయేదాక పని చేస్తున్నామని దీంతో ఎక్కువ కూలీ వస్తోందని అంటున్నాడు ఉతరఖాండ్ నుంచిన సన్నాసిరాజ్. వలస కూలీల రాకతో కూలీ రేట్లు తక్కువగా ఉండడమే కాకుండా పనులు కూడా స్పీడుగా అవుతున్నాయని రైతులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాట్ల సీజన్ కాగానే తమ ప్రాంతాలకి వెళ్లిపోతామని కూలీలు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి..

ముంబయికి మరో 900 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిసిటీ ఏసీ బస్సులు

పైపు పగిలి రోడ్డు పాలవుతున్న మంచి నీళ్లు