చైనా యాప్స్‌ బ్యాన్‌.. లోకల్‌ యాప్స్‌కు పెరిగిన డిమాండ్‌

చైనా యాప్స్‌ బ్యాన్‌.. లోకల్‌ యాప్స్‌కు పెరిగిన డిమాండ్‌

లక్షల్లో పెరిగిన డౌన్‌లోడ్స్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్‌ను బ్యాన్‌ చేయడంతో లోకల్‌ యాప్స్‌కు విపరీతమైన ఆదరణ పెరిగింది. యాప్స్‌ బ్యాన్‌ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు లక్షల్లో స్వదేశీ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 15 లోకల్‌ భాషల్లో ఉన్న షేర్‌‌చాట్‌ను 48 గంటల్లో దాదాపు 1.5కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ మేరకు ఆ సంస్థ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయడంతో రొపోసో యాప్‌కు మంచి ఆదరణ కలిగిందని కంపెనీ వర్గాలు చెప్పాయి. టిక్‌టాక్‌లో ఫేమస్‌ అయిన వాళ్లు, లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నవారు, ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇప్పుడు రొపోసో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, దాంతో ఫాలోవర్స్‌ పెరిగారని అన్నారు. మన దేశంలో తయారైన ఈ యాప్‌ దాదాపు 12 భాషల్లో సేవలందిస్తోంది. టిక్‌టాక్‌ పోటీ సంస్థగా చెప్పే చింగారి యాప్‌ను కూడా చాలా మంది డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. 10 రోజుల క్రితం డౌన్‌లోడ్‌ సంఖ్య 5లక్షలు ఉండగా.. ఇప్పుడు అది 25 లక్షలకు చేరుకుంది. వీటితో పాటు మన దేశానికి చెందిన చాలా యాప్స్‌ను జనం ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. మహీంద్రా ఆధ్వర్యంలో ఉన్న సామాజిక సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాం గోసోషియల్‌కు కూడా ఆదరణ పెరిగింది. బాక్స్‌ ఎంగేజ్‌ .కామ్‌కు యూజర్లు పెరిగారు. అలాగే ట్రెల్‌, ఖబ్రీ లాంటి యాప్‌లు కూడా విపరీతంగా డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నట్లు చెప్పారు. చైనా యాప్‌లపపై నిషేధం భారత సంస్థలకు చాలా మేలు చేస్తుందని, కొత్త టాలెంట్‌ బయటికి వస్తుందని నిపుణులు చెప్తున్నారు.